ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి

by Sridhar Babu |
ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి
X

దిశ, పాల్వంచ : పాల్వంచ పరిధిలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలంలోని కరక వాగు గ్రామానికి చెందిన బాధితులు నూతన ఇంటి నిర్మాణం పనుల్లో దగ్గరలో ఉండే తన బంధువు ఇంటి నుంచి కరెంట్ ను తీసుకొని వాడుకుంటున్న క్రమంలో పాల్వంచకి చెందిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగి నాగరాజు సమాచారం తెలుసుకొని విద్యుత్ శాఖ అనుమతులు లేకుండా అక్రమంగా కరెంట్ వాడుకోవడంతో బాధితుడిపై విద్యుత్ శాఖ నియమాల ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించాడు.

తన నూతన ఇంటి నిర్మాణానికి విద్యుత్ సరఫరాకు కరెంట్ మీటర్ కేటాయించాలని బాధితులు కోరినప్పటికీ ముందుగా అక్రమంగా కరెంట్ వాడినందుకు కేసు నమోదు చేస్తామని, లేదంటే లంచం ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశాడు. అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేమని 26 వేల రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. విద్యుత్ అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం బాధితుల వద్ద 26 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న తరుణంలో రెడ్ హ్యాండెడ్ గా విద్యుత్ ఉద్యోగి నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు తాము చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed