దిశ ఎఫెక్ట్ : అండగా ఉంటానంటూ.. వైద్య శిబిరం ఏర్పాటు?

by samatah |
దిశ ఎఫెక్ట్ : అండగా ఉంటానంటూ.. వైద్య శిబిరం ఏర్పాటు?
X

దిశ, వైరా : "ఫ్లూ జ్వర బాధితులకు అండగా ఉంటా.. మీకేం కాదు.. జ్వరంతో బాధపడుతున్న వారు అధైర్య పడొద్దు.. భయాందోళనకు గురికావద్దు.. మీరు ధైర్యంగా ఉండండి.. మీకోసం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాం.. అవసరమైతే ఉన్నత స్థాయి డాక్టర్లను తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయిస్తాం.. ప్రభుత్వ వైద్యులు మీ ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తారు"అంటూ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఫ్లూ జ్వర బాధితులకు స్పష్టమైన భరోసా ఇచ్చారు. వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో గ్రామస్తులు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్న అంశాన్ని దిశ వెబ్సైట్, దినపత్రిక "వణుకుతున్న వల్లాపురం" అనే వార్త కథనాన్ని మంగళవారం రాత్రి, బుధవారం ప్రచురించింది.

ఈ వార్త కథనానికి గంట వ్యవధిలోపే స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే మంగళవారం రాత్రి వల్లాపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతిను ఆదేశించారు. దిశలో ప్రచురితమైన కథనాలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ స్పందించి బుధవారం ఉదయం 8 గంటలకే వల్లాపురం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో జ్వర బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. జ్వరంతో బాధపడుతున్న పలువురికి ఆయన స్వయంగా దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ గ్రామస్తులతో మాట్లాడారు. తమ గ్రామంలో ప్రతి ఇంట్లో జ్వరం‌తో బాధపడేవారు ఉన్నారని గ్రామస్తులు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి వైద్యాధికాలకు పలు సూచనలు చేశారు.

గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. ఏదైనా అనుమానం ఉంటే కోవిడ్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. వల్లాపురం గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, భయాందోళనకు గురికావద్దని చెప్పారు. గ్రామంలో అనేకమందికి సీజన్ వ్యాధిలో భాగంగా జ్వరాలు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. జ్వర బాధితులకు తాను అండగా ఉంటానని అదైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. అవసరమైతే ఉన్నత స్థాయి డాక్టర్లతో ప్రభుత్వం తరఫున గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామంలో జ్వర సమస్య పూర్తిగా నియంత్రణ అయ్యేంతవరకు వైద్యాధికారులు వల్లపురం పై ప్రత్యేక దృష్టి సారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు పసుపులేటి మోహన్రావు, వేల్పుల మురళి, గ్రామ సర్పంచ్ గొర్రె ముచ్చు సారమ్మ, ఉప సర్పంచ్ వేమూరి కళ్యాణి, ఆదర్శ రైతు తుమ్మల రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story