Lokayukta : గుట్టలు కొల్లగొట్టి కోట్ల రూపాయలు స్వాహా..

by Sumithra |
Lokayukta : గుట్టలు కొల్లగొట్టి కోట్ల రూపాయలు స్వాహా..
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న రఘునాధపాలెం మండలంలో గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి అనుచరుడు షఫీ అనే వ్యక్తి మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరిపారు. ఈ విషయం పై కొంతమంది ఆర్టీఏ ఆక్టివిస్టులు గుట్ట తవ్వకాల పై లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆరా తీసి తమకు నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. లోకాయుక్త జోక్యంతో కదిలిన యంత్రాంగం అక్రమ మట్టి తవ్వకాల పై ఆరా తీసి నివ్వెరపోయే నిజాలను బయటకు తీశారు. గత ప్రభుత్వం హయాంలోనే ఆ గుట్ట అక్రమ తవ్వకాల దారుడి పై 16 కోట్ల జరిమానా విధించింది కోర్టు. కానీ నేటికీ ఆ అక్రమ తవ్వకాలకు సంబంధించిన జరిమాన కట్టకపోగా మారిన ప్రభుత్వంలో కూడా కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకుంటూ షఫీ తన దందాను కొనసాగిస్తూనే ఉన్నాడని తెలిసింది. దీంతో పాటుగా రూరల్ ప్రాంతంలో భూ వ్యవహారాల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

రఘునాధపాలెం మండలం కోయచిలక రెవెన్యూ సర్వేనెంబర్ 192/1 లోని గుట్టను 2016న తెలంగాణ మినరల్స్ అనే సంస్థ యజమాని రావెళ్ళ అశోక్ కు ఐదు సంవత్సరాల కాలపరిమితికి 10 ఎకరాల తవ్వకాలకు అనుమతినించింది. దీన్ని ఒకే సంవత్సరంలో పూర్తి చేసి 2020 నాటి వరకు మరో 20 ఎకరాలు అక్రమంగా తవ్వకాలు జరిపారు. ఈ విషయం పై ఆర్టీఏ ఆక్టివిస్టులు కొందరు 856 /2020/బి1 లోకాయుక్త కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఇప్పటివరకు మూడు సార్లు లోకాయుక్త టీం గుట్ట వద్దకు పరిశీలనకు రాగా ఢిల్లీ నుంచి ఎన్జీటీ సిబ్బంది కూడా ఒకసారి వచ్చి విచారించారు. అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్ రోనాల్డ్ దాస్ ఐపీఎస్ ఆ ప్రదేశానికి వచ్చి చూసి వెళ్లారు. ఇప్పటి వరకు 29 సార్లు విచారణలు జరగగా ఒక్కసారి కూడా రెవెన్యూ, మైనింగ్ అధికారులు సరైన వివరాలు కోర్టుకు ఇవ్వలేక చేతులు ఎత్తేశారు.

మైనింగ్ అక్రమాల పై గత ప్రభుత్వ హయాంలోనే మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆ ప్రదేశానికి వెళ్లి అక్రమ గుట్ట తవ్వకాలను పరిశీలించి అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10-07-24 న మరోసారి లోకాయుక్త టీం ఆ ప్రదేశానికి వచ్చి తహశీల్దార్, ఎడి మైనింగ్, ఎడి సర్వే వారి సిబ్బంది మరోసారి పరిశీలించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకి మరో హెక్టార్ల గుట్టను తొవ్వేందుకు అనుమతులు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. (ఏం) చింతగుర్తి సర్వేనెంబర్ 266 లో మైనింగ్ అనుమతులు ఇచ్చారని తెలిపారు. కానీ కోయి చిలక రెవెన్యూ 192/1 మంచుకొండ రెవెన్యూ 360, 361, 362, 363, 364, 365( ఏం) చిత్తగుర్తి రెవెన్యూ సర్వే రఘునాధపాలెం మండలం రెవెన్యూ సర్వే నెంబర్ 30, 280 లో మొత్తం సుమారు 250 ఎకరాల్లో సుమారు 17 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొవ్వినట్లు తెలిసింది. ఈ విషయం పై అసలు అక్కడ ఇచ్చిన అనుమతులు ఏమని ఫిర్యాదు దారులు మంద బుచ్చిబాబు, కోయిన్ని వెంకన్న, బద్రు నాయక్ లోకాయుక్త ద్వారా అధికారులను అడగగా మేము ఎక్కడ అనుమతులు ఇచ్చాము మాకే తెలియదని తెలిపినట్లు ఆర్టీఏ ఆక్టివ్ కోయిన్నీ వెంకన్న తెలిపారు.

ఈ అక్రమాల వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో పనిచేసిన ప్రజాప్రతినిధులు కొందరు నాటి మంత్రి అనుచరుడు షఫీతో సహా కాంగ్రెస్ పేరు చెప్పుకొని మరికొందరు నాయకులు ఈ అక్రమాల్లో ఉన్నట్లు తెలిసింది. ఇంతే కాకుండా బాలపేట రెవెన్యూ సర్వేనెంబర్ 37లో గతంలోనే మూడు కోట్ల 97 లక్షల జరిమానా వేసిన ప్రస్తుతం అక్కడ కట్టకొమ్ము తండా నుండి వైఎస్సార్ నగర్ వరకు సుమారు పది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమం జరిగినట్లు తెలిసింది. ఇవేకాక ముందుగా పేర్కొన్న మట్టి అక్రమాల పై మధ్యంతర జరిమానా 21-02-2022 న లోకాయుక్త పదహారు కోట్లు ఫైన్ వేసిన ఇంతవరకు అక్రమదారుడు షఫీ చెల్లించకపోవడం శోచనీయం. ప్రస్తుతం ఈ కొత్త ప్రభుత్వంలో కూడా అతని అక్రమాల పై ప్రశ్నించలేదు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, ఏనుకూరు, పెనుబల్లి చింతకాని, మండలాల్లో కూడా ఇతను లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమ తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed