Sri Chaitanya School : పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

by Sumithra |
Sri Chaitanya School : పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
X

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ లో గల శ్రీ చైతన్య పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న గాయత్రి అనే విద్యార్థిని గురువారం నాడు పాఠశాలలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం పై విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలోని హిందీ బోధిస్తున్న టీచర్ తరచూ బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తుందని, దాంతో పాటుగా విద్యార్థిని తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఆ టీచర్ వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వాపోతున్నారు. నిన్న ఉదయం ఆ విద్యార్థిని వాళ్ల బంధువుల ఇంటి నుండి నిద్ర మాత్రలను తన వెంట తెచ్చుకొని పాఠశాల ఆవరణంలో 8 మాత్రలు మింగినట్లు తెలుస్తుంది.

ఈ విషయం తను కళ్ళు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులతో చెప్పటంతో ఆ విద్యార్థులు యాజమాన్యం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని దీనిపై పాఠశాల యాజమాన్యం ఇంతవరకు స్పందించడం కానీ వచ్చి పరామర్శించడం కానీ చేయలేదని వాపోతున్నారు. ఈ విషయం పై పాఠశాల యాజమాన్యంతో మాట్లాడదామని శుక్రవారం పాఠశాలకు వచ్చామని కానీ తమకు సంబంధం లేనట్లుగా యాజమాన్యం ప్రవర్తిస్తుందని, తక్షణమే పాఠశాల యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని, అలాగే దీనికి కారణమైన హిందీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యార్థులను వత్తిళ్లకు గురిచేస్తూ వారు ఆత్మహత్యానికి పాల్పడేలా ప్రేరేపిస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల పై ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



Next Story