CM Revanth: అమిత్ షా, కిషన్‌రెడ్డిపై కంప్లైంట్ చేసిందే మేం: సీఎం రేవంత్

by Gantepaka Srikanth |
CM Revanth: అమిత్ షా, కిషన్‌రెడ్డిపై కంప్లైంట్ చేసిందే మేం: సీఎం రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నందున, రాష్ట్రాలను కలుపుపోయే బాధ్యత ఉన్నందున మోడీని పెద్దన్న అని పిలిచానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధులు, సహకారం తదితరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అలా పిలవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప రాజకీయ ప్రయోజనాలేవీ లేవన్నారు. ఆయన ద్వారా వార్డు మెంబర్‌ పోస్టుకు బీ-ఫామ్ కూడా రాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను తప్ప మోడీ దయాదాక్షిణ్యాలతో పనే లేదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైవే లేవనెత్తిన అంశానికి జవాబుగా సీఎం రేవంత్ పై క్లారిటీ ఇచ్చారు.

ప్రధాని హోదాలో ఆదిలాబాద్‌కు ఒక అధికారిక కార్యక్రమానికి మోడీ వచ్చినప్పుడు సీఎం హోదాలో తాను హాజరై స్వాగతం పలికానని, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాల్సింగా ఓపెన్ స్టేజీపైనే పెద్దన్న పాత్ర పోషించాలంటూ రిక్వెస్టు చేశానని రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి సహకారాన్ని కోరడం తన బాధ్యత అని, అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూస్తూ అనుమతులు, నిధులు ఇవ్వడం ప్రధానిగా మోడీ బాధ్యత అని నొక్కిచెప్పారు. తెలంగాణ నుంచి ఒక రూపాయ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తూ ఉంటే తిరిగి 43 పైసలు మాత్రమే వస్తున్నదని, బిహార్‌కు మాత్రం ఒక్క రూపాయికి తిరిగి రూ. 7.26 వెళ్తున్నదని, ఉత్తరప్రదేశ్‌కు దాదాపు ఆరు రూపాయలపైనే వెళ్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గుజరాత్ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నట్లుగానే తెలంగాణకు కూడా ఇవ్వాలన్నదే తన ఉద్దేశమన్నారు.

ప్రజలు ఆయనకు పీఎం హోదా ఇస్తే తనకు సీఎంగా అవకాశం ఇచ్చారన్నారు. అధికారిక కార్యకలాపాల్లో పీఎం, సీఎంల మధ్య సఖ్యత, సమన్వయం ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి సహకారం అందాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేయడం సీఎంగా తన బాధ్యత అని, ఆ పని నెరవేర్చానని అన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ, ఇంత చేసినా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చిందేమీ లేదు అని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టుకు సైతం కేంద్రం 15% వాటా ఉండేలా విధివిధానాలను రూపొందించినా వస్తుందనే నమ్మకం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా అనేక ద్రవ్య సంస్థలు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇన్వెస్టర్లు కూడా చాలా మంది రెడీగా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా ఓల్డ్ సిటీ మెట్రో సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుందని సీం రేవంత్ స్పష్టం చేశారు.

షా, కిషన్‌రెడ్డిపై కేసులు పెట్టించిందే మేము :

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పాత బస్తీలో జరిగిన ప్రచార సభలో నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు అమిత్ షా, కిషన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను భాగస్తుల్ని చేసినందుకు కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఈ కంప్లైంట్ చేశారని, దాని ఆధారంగానే వారిద్దరితో పాటు నిర్వాహకులపైనా ఎఫ్ఐఆర్ పెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత చార్జిషీట్‌ కూడా కోర్టులో ఫైల్ అయిందన్నారు. కానీ పోలీసులు విచారణ చేసి తర్వాత చార్జిషీట్‌లో వారిద్దరి పేర్లను తొలగించారని, దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ చేశామని గుర్తుచేశారు. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు అమిత్ షా, కిషన్‌రెడ్డిపై చర్యలకు ఎన్నికల సంఘం నిరాకరించి క్లీన్ చిట్ ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు.

Advertisement

Next Story