వార్డుకో ఆఫీసర్.. హైదరాబాద్ రీజియన్‌కు 958

by srinivas |
వార్డుకో ఆఫీసర్.. హైదరాబాద్ రీజియన్‌కు 958
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ప్రభుత్వ పథకాలు వేగవంతంగా చేరేవిధంగా పురపాలక,పట్టణాభివ్రద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. అందుకనుగుణంగానే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డు స్థాయిలో సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కరించేవిధంగా ఒక్కో వార్డుకు ఒక ఆఫీసర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 1829 మంది గ్రూపు-4 ఉద్యోగులను వార్డు ఆఫీసర్లుగా కేటాయించింది. వీరిలో హైదరాబాద్ రీజియన్ కు 958 మంది, వరంగల్ రీజియన్ కు 871మంది అలాట్ చేసిన విషయం తెలిసిందే.

142పట్టణ స్థానిక సంస్థల్లో

రాష్ట్ర వ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 77,24,428 జనాభా ఉంది. వీటికిగాను 3,488 వార్డలు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 16 ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 13 ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. నల్గొండ, మంచిర్యాల జిల్లాల్లో ఏడు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఆరు, కరీంనగర్, సిద్దిపేట్, సూర్యపేట, వనపర్తి జిల్లాల్లో నాలుగేసి చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి.

50వేలపైగా జనాభాకు ఒక ఆఫీసర్

రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో 3488 వార్డులు ఉన్నాయి. అయితే 50వేల జనాభా కంటే తక్కువగా ఉంటే రెండు వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50వేలకుపైగా జనాభా ఉంటే ఒక వార్డు ఆఫీసర్ పెట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగుడ, జవహార్ నగర్, నిజాంపేట్, బండ్లగుడ జాగీర్, మీర్ పేట్, బడంగ్ పేట పరిధిలోని ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్ ను నియమించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసర్ ను కేటాయించే అవకాశముందని చెబుతున్నారు.

1928 మంది గ్రూపు-4 ఉద్యోగులు హాజరు

పురపాలక శాఖకు కేటాయించిన 2217 మంది గ్రూపు-4 ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని రెండు రోజులుగా అధికారులు నిర్వహించారు. వీరిలో ఇప్పటి వరకు 1928 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 289 మంది ఉద్యోగులకు ఫోన్ చేసిన మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 1023 మంది హాజరయ్యారు. వీరిలో వార్డు ఆఫీసర్లు 821, జూనియర్ అసిస్టెంట్లు 91, జూనియర్ అకౌంటెంట్లు 111 మంది ఉన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 905 మంది హాజరైతే వారిలో వార్డు ఆఫీసర్లు 748 మంది, జూనియర్ అసిస్టెంట్లు 66, జూనియర్ అకౌంటెంట్లు 91 మంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed