Commissioner Ranganath: రాజకీయాలతో హైడ్రాకు సంబంధం ఉండదు

by Gantepaka Srikanth |
Commissioner Ranganath: రాజకీయాలతో హైడ్రాకు సంబంధం ఉండదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలకు విరుద్దంగా వెలిసిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి నిర్మించే భవనాలను కూల్చేయడమే హైడ్రా పని తప్ప నోటీసులు ఇవ్వడం తమ విధి కాదని కమిషనర్ రంగనాధ్ స్పష్టం చేశారు. కూల్చివేయాలనుకున్న భవనాలకు నోటీసులు ఇవ్వడం హైడ్రా డ్యూటీ కాదని, అది వేరే విభాగాలు చేసే పని అని అన్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలను, ఆక్రమణలను నేలమట్టం చేయడమే హైడ్రా బాధ్యత అని నొక్కిచెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యాచరణ ఉంటుందని, రాజకీయాలతో హైడ్రాకు ఎలాంటి సంబంధమూ ఉండదని స్పష్టం చేశారు. చెరువుల్లో కాలేజీలు కట్టినా కూల్చేయడమే హైడ్రా డ్యూటీ అని, కాకుంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిమాలిషన్ చేయడానికి సంబంధిత కాలేజీ యాజమాన్యానికి కొంత గడువు ఇస్తామన్నారు. బీజేపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్‌ను ఆయన ఆఫీసులో కలిసిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

అక్రమ భవనాలను హైడ్రా ఎప్పుడూ నోటీసులు ఇవ్వదని, వాటిని కూల్చేసి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడమే ఈ సంస్థ విధి అని కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్)ను ఆక్రమించి లేదా బఫర్ జోన్‌ను కబ్జా చేసి కళాశాలలను నిర్మించినా హైడ్రా కూల్చేయకుండా వదలదని క్లారిటీ ఇచ్చారు. అలాంటి నిర్మాణాలు చేసే వ్యక్తులు, సొసైటీలు, యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును కూడా తాము దృష్టిలో పెట్టుకుంటామని, ఒక్కసారిగా పిల్లలు రోడ్డున పడకుండా, వారి చదువులకు ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటుందన్నారు. ఆ కారణంగానే అక్రమంగా కట్టిన కళాశాలల యాజమాన్యానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేంతవరకు కొంత గడువు ఇచ్చి ఆ తర్వాత నేలమట్టం చేస్తామన్నారు.

రాజకీయ చదరంగంలో హైడ్రా ఒక పావుగా మారదల్చుకోలేదని, రాజకీయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థే హైడ్రా అని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్లు (జీహెచ్ఎంసీ) ప్రస్తావించిన పలు అంశాలను ఉదహరించిన రంగనాధ్... చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. ఓవైసీ, మల్లారెడ్డి సహా పలువురు చెరువుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలను కట్టారని కార్పొరేటర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లి వీటన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని చేసిన విజ్ఞప్తులపై రంగనాధ్ పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed