ఓఆర్ఆర్ వెంట యంత్రాలు సిద్ధంగా ఉంచండి.. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ ఆదేశం

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-02 15:12:08.0  )
ఓఆర్ఆర్ వెంట యంత్రాలు సిద్ధంగా ఉంచండి.. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా రెడ్ ఎల‌ర్ట్ జారీ చేసినందున ఔట‌ర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట ప‌లు ప్రాంతాల‌ను హెచ్ఎండీఏ మెట్రోపాలిట‌న్ క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ ప‌రీక్షించారు. గ‌త ఏడాది నీరు భారీగా నిలిచిపోయిన కొల్లూరు జంక్షన్, మ‌ల్లంపేట‌, శామీర్‌పేట ప్రాంతాల్లో ఆయ‌న‌ పర్యటించారు. ఆయనతో పాటు హెచ్ జీసీఎల్ సీజీఎం ర‌వీంద్ర, ఐఆర్‌బీ ఇంజినీర్లు, ఇత‌ర అధికారులు ఉన్నారు. డ్రెయిన్ల ప్రస్తుత ప‌రిస్థితిని క‌మిష‌న‌ర్ పరిశీలించి, పూడిక‌తీత ప‌నుల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేశార‌ని, ఇంత భారీ వ‌ర్షాలు కురిసినా ఎక్కడా నీళ్లు నిల‌బ‌డ‌లేద‌ని ప్రశంసించారు. నిర్వహ‌ణ సంస్థ మెస‌ర్స్ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే సంస్థకు క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు.

ప్రస్తుతం చేస్తున్నట్లే ఈ ప‌నుల‌న్నీ కొన‌సాగించాల‌న్నారు. ఎప్పటికప్పుడు నిర్వహ‌ణ పనులు చేయాల్సిన ప్రాధాన్యం గురించి స్పష్టం చేశారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో అప్రమ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ఒక‌వేళ నీళ్లు చేరినా తోడేందుకు పంపులు, ఎక్స్‌క‌వేట‌ర్లు, ఇత‌ర యంత్రాల‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవ‌స‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల‌ని సూచించారు. ఓఆర్ఆర్ మీద వెళ్లే వాహ‌న‌దారులంద‌రికీ సాయం చేసేందుకు పాట్రోలింగ్ బృందాల‌ను మ‌రింత‌గా పెంచాల‌ని, అలాగే వేరియ‌బుల్ మెసేజ్ సైన్ (వీఎంఎస్) బోర్డుల మీద రెయిన్ ఎల‌ర్ట్ మెసేజీలు చూపిస్తూ వాహ‌న‌దారుల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. పూడిక‌తీత ప‌నుల‌ను స‌రైన స‌మ‌యానికి, స‌మ‌ర్థంగా చేసినందుకు అభినందించారు. దీని వ‌ల్ల వ‌ర్షపు నీరు ఎప్పటిక‌ప్పుడు వెళ్లిపోతూ, ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో కూడా హైద‌రాబాద్ వాసుల ప్రధాన ర‌వాణా మార్గమైన ఓఆర్ఆర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహ‌నాలు వెళ్తుండ‌టం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story