పార్ట్ టైం జాబ్స్ అంటూ దేశవ్యాప్తంగా 140 మందికి చీటింగ్

by Bhoopathi Nagaiah |
పార్ట్ టైం జాబ్స్ అంటూ దేశవ్యాప్తంగా 140 మందికి చీటింగ్
X

దిశ, సిటీక్రైం: మీకు పార్ట్ టైం జాబ్స్ ఇస్తాం.. కేవలం మీరు మమ్ముల్ని ఫాలో అయితే చాలు.. లక్షల రూపాయల ఆదాయం మీకు వస్తుంది అంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ బూరిడీ కొట్టిస్తున్న ఈ కేటుగాళ్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం....

మహారాష్ట్ర అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణ బాబన్ పవార్, రమాకాంత్ జీవన్‌లు సైబర్ నేరగాళ్లుగా మారారు. పార్ట్ టైం జాబ్‌లు ఇస్తామంటూ టెలిగ్రామ్‌ ద్వారా మెసేజ్‌లు పంపిస్తారు. అమాయకులు వారి ట్రాప్‌లో పడగానే వారి వెబ్ సైట్‌ను ఫాలో కావాలని, దాని కోసం యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు పెట్టిస్తారు. అలా పెట్టగానే వారికి కేటాయించిన పేజీలో లాభాలు చూపిస్తూ అంకెల గారడీ చేస్తారు. వాటిని విత్ డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రం ఉండదు. అలా అమాయకులను మోసం చేస్తూ లక్షల రూపాయలకు పాల్పడుతున్నారు.

ఇలా వీరి ట్రాప్‌లో పడ్డ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రూ.1.61 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు గచ్చిబౌలిలో పలు బ్యాంకులలో ఖాతాలను తెరిచేందుకు వచ్చి తిరుగుతుందడంతో ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు సైబర్ క్రిమినల్స్ దేశవ్యాప్తంగా 140 మందిని మోసం చేశారని తేలింది. మన రాష్ట్రంలో వీరి మూలంగా 9 మంది ఆర్థికంగా నష్టపోయారని పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed