KCR కీలక నిర్ణయం.. ప్రత్యేక ప్రతినిధిగా సోమేశ్?

by Sathputhe Rajesh |
KCR కీలక నిర్ణయం.. ప్రత్యేక ప్రతినిధిగా సోమేశ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని సమాచారం. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతలతో పాటు ఉత్తరాదిన బీఆర్ఎస్ విస్తరణ పనులు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది. సోమవారం ఔరంగాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై సోమేశ్ కుమార్ ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సోమేశ్ గురించి పొగుడుతూ మాట్లాడారు. దీంతో ఆయన త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని సంకేతాలు ఇచ్చినట్లయింది. కేబినెట్ ర్యాంక్ హోదా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను నియమించినా, ఇప్పటివరకు ఎవరికీ కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. కానీ సోమేశ్ కుమార్‌కు మాత్రం కేబినెట్ ర్యాంకు హోదాతో ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేస్తారని ప్రచారం ఉంది. రిటైర్ట్ ఐఏఎస్, ఐపీఎస్‌లను బీఆర్ఎస్‌లో చేర్పించే టాస్క్‌ను అప్పగిస్తారని సమాచారం.

వివాదాల పరిష్కార బాధ్యతలు..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని న్యాయస్థానాల్లో ఉండగా, ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా 8, 9 షెడ్యూల్‌లోని అనేక సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. మరో ఏడాది కాలంలో వీటిని పరిష్కరించుకోవాలని కేంద్రం పదే పదే రాష్ట్రానికి లేఖలు రాస్తున్నది. దీంతో ఈ వివాదాలను పరిష్కరించే బాధ్యతలను సోమేశ్ కుమార్‌కు అప్పగిస్తారని ప్రచారం ఉంది.

సోమేశ్ ఎంట్రీతో షాక్...

సీఎస్‌గా పనిచేసిన సమయంలో సోమేశ్ కుమార్‌తో చాలామంది అధికారులు, లీడర్లు ఇబ్బంది పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరంతా అతడిని ఔరంగాబాద్ బీఆర్ఎస్ మీటింగ్‌లో చూసిన తర్వాత షాక్ గురైనట్టు తెలిసింది. ప్రభుత్వంలో పదవి ఇస్తే తమ పరిస్థితి ఏంటి? అని డిస్కషన్ చేసుకుంటున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed