మాస్టర్ మైండ్ కేసీఆరే..! కమిషన్ విచారణలో సారు గురించి సంచలన విషయాలు

by karthikeya |   ( Updated:2024-10-29 03:07:24.0  )
మాస్టర్ మైండ్ కేసీఆరే..! కమిషన్ విచారణలో సారు గురించి సంచలన విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లనీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్‌కు అందాయి. వ్యాప్కోస్ రూపొందించిన డీపీఆర్‌లో తొలుత లెక్కలేసుకున్న అంచనా వ్యయాన్ని ఆ తర్వాత కొన్ని సవరణలతో పెంచేందుకు అప్పటి సీఎం హోదాలో కేసీఆర్ ఆమోదం తెలిపారని రిటైర్డ్ ఈఇన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో భాగంగా మూడు రోజుల పాటు 277 ప్రశ్నలకు ఆయన నుంచి జస్టిస్ ఘోష్ ఆన్సర్స్ రాబట్టారు. అంచనా వ్యయం పెంచాలనే డెసిషన్‌తో పాటు మూడు బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్స్ ఖరారు చేసేందుకూ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ఆయన కమిషన్‌కు వివరించారు. జస్టిస్ ఘోష్ ఎదుట సోమవారం హాజరైన నల్లా వెంకటేశ్వర్లు.. మౌఖికంగా చెప్పిన సమాధానాలన్నింటికీ సంబంధించిన డాక్యుమెంట్లు, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మినిట్స్ కాపీలు అందజేశారు. చివరకు బ్యారేజీల్లో నీళ్లు నింపేందుకు సైతం కేసీఆర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

విధాన నిర్ణయంతో ఆమోదం

మొదట రూపొందించిన డీపీఆర్‌లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ ఆఫీసర్లు చేసిన ప్రతిపాదనలను వివిధ మీటింగుల్లో చర్చించామని, చివరకు సీఎం హోదాలో కేసీఆర్ విధాన నిర్ణయం తీసుకుని ఆ ప్రపోజల్స్‌కు ఆమోదం తెలిపినట్టు నల్లా వెంకటేశ్వర్లు.. కమిషన్‌కు వివరించారు. అన్నారం బ్యారేజీ యాక్సిస్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్పష్టమైన నిర్ణయం ఉన్నా కేంద్ర జల సంఘం ఆమోదం లభించిన తర్వాత మార్పులు జరిగాయని మూడు రోజుల ముందు చెప్పిన అంశాన్ని ధృవీకరించే తీరులో డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ ఉత్తర్వులను ఆయన కమిషన్‌కు అందజేశారు. బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్స్ ఫైనల్ అయ్యేందుకు ముందు నిర్వహించిన జియో టెక్నికల్ ఫౌండేషన్ మ్యాప్‌లు, డ్రాయింగ్‌లు, టెక్నికల్ వివరాలను తెలియజేసే డాక్యుమెంట్లను సైతం ఆయన కమిషన్‌కు సమర్పించారు. మూడు బ్యారేజీలకు సంబంధించిన విడివిడి డీపీఆర్‌లను, అంచనా వ్యయాన్ని, టెక్నికల్ అంశాల ప్రతులనూ కమిషన్‌కు ఇచ్చారు. షీట్ పైల్స్, సీకెంట్ పైల్స్, వెంట్స్, ఫ్లడ్ ఛానెల్స్ తదితర అంశాలను వివరించే డాక్యుమెంట్లు సైతం అందజేశారు.

ఆపరేషన్, మెయింటెనెన్స్ లేక కుంగిన బ్యారేజీ!

మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులో కొన్ని పిల్లర్లు కుంగిపోయేందుకు, డ్యామేజీ అయ్యేందుకు దారితీసిన రీజన్స్‌పై జస్టిస్ ఘోష్ కమిషన్.. నల్లా వెంకటేశ్వర్లును ప్రశ్నించగా ఆపరేషన్, మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం, డిశ్చార్జి పరిమాణం ఎక్కువగా ఉండడం, ఎనర్జీ డిస్సిమేషన్‌లో అంచనాలు తప్పడం వల్లే పిల్లర్లు కుంగిపోయి ఉండొచ్చని ఆయన రీజన్ చెప్పారు. అప్పటి సీఎంగా కేసీఆర్ ఆదేశాలతోనే నీటిని మాగ్జిమమ్ స్థాయికి స్టోర్ చేయాల్సి వచ్చిందని, టెక్నికల్‌గా టెయిల్ వాటర్ లభ్యత లేకపోవడం, గేట్ల ఆపరేషన్ సక్రమంగా లేకపోవడమూ పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఒండొచ్చని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో పని చేసిన సీఈ, ఎస్ఈ, ఈఈల పేర్లు తీసుకున్న జస్టిస్ ఘోష్... సీకెంట్ పైల్స్ వాడాలంటూ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ ఇచ్చిన ఆదేశాలు, సూచనలకు సంబంధించిన ఫైళ్లు సైతం కమిషన్‌కు అందజేశారు. బ్యారేజీల నిర్మాణానికి అవసరమైన అనుమతుల జాబితాను అందించారు. తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ చేసిన 2-డీ, 3-డీ స్టడీ రిపోర్టులు కూడా ఆయన కమిషన్‌కు సమర్పించారు.

కాంట్రాక్టు ఏజెన్సీల దృష్టికి లోపాలు

బ్యారేజీల నిర్మాణంలో ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ నిబంధనలన్నీ పాటించామని, చీఫ్ ఇంజినీర్‌గా తాను పనుల తీరును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు గుర్తించిన లోపాలను కాంట్రాక్టు ఏజెన్సీల దృష్టికి తీసుకెళ్లానని, వాటిని తాను సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చినట్లు నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో (ఎగువ ప్రాంతం) నీటి నిల్వ లేనందున పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో.. సీకెంట్ పైల్స్ పరిస్థితి ఏమిటో.. సిమెంట్ కాంక్రీట్ శ్లాబ్‌లు ఎందుకు కొట్టుకపోయాయో.. వీటన్నింటినీ ఇప్పుడు తనిఖీ చేస్తే టెక్నికల్ అంశాలు వెలుగులోకి వస్తాయా?... నిర్దిష్టమైన కారణాలు అంచనా వేయడం వీలవుతుందా?.. అని కమిషన్.. నల్లా వెంకటేశ్వర్లును ప్రశ్నించగా సానుకూల సమాధానం చెప్పారు. మూడు బ్యారేజీలకు సంబంధించి ఒరిజినల్ డీపీఆర్‌లో ఏమున్నదో, వాటికి సవరణలు ఎప్పుడు జరిగాయో, దాన్ని ప్రతిపాదించి ఎవరో, చివరకు ఆమోదం తెలిపింది ఎవరో అన్ని సమావేశాల మినిట్స్ కాపీలు కమిషన్ దగ్గరకు చేరడంతో తదుపరి విచారణ సందర్భంగా కీలకంగా మారనున్నది.

Also Read: కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్.. అడుగడుగునా నిర్లక్ష్యమే..

Advertisement

Next Story