- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేటేసినా.. వెంటాడడమే.! వారిద్దరి కదలికలపై గులాబీ బాస్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నుంచి తాజాగా సస్పెండైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కదలికలపై అధిష్టానం నిఘా పెట్టింది. వారితో టచ్‌లో ఉన్నదెవరు? వారి వెంట వెళ్లేదెవరు? వంటి వాటిని ఆరా తీసే పనిలో పడింది. పొంగులేటి, జూపల్లి ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఉమ్మడి ఖమ్మం, పాలమూరు జిల్లాల్లో ఎవరెవరు వారితో కలిసి నడుస్తారనే దానిపై జిల్లా ఇన్‌చార్జులను అలర్ట్ చేసింది.
పార్టీ నేతలు జారి పోకుండా చర్యలు చేపట్టింది. ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు వివరాలను ప్రభుత్వానికి అందిస్తుండడమే కాకుండా.. ఆ ఇద్దరి నేతల ఫోన్ల డేటాపైనా ఫోకస్ పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారని, పార్టీ క్రమశిక్షణను తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొంటూ జూపల్లి, పొంగులేటిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసినది తెలిసిందే.
ఉమ్మడి జిల్లాల్లో బలమైన కేడర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి బలమైన నేత. పది స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించగల కేడర్ ఉంది. బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నారు. భద్రాచలం తెల్లం వెంకట్రావు, పినపాక పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు కోరం కనకయ్య, వైరా విజయబాయి, అశ్వరావుపేట ఆదినారాయణ, మధిర కోట రాంబాబు పోటీ చేస్తారని వెల్లడించారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంకు ప్రకటించలేదు. కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీచేస్తారనే ప్రచారంలో ఉంది.
ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమ్మేళనంలో పొంగులేటి, జూపల్లిలు ఒకే వేదిక పంచుకున్నారు. జూపల్లికి సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పట్టుంది. అచ్చంపేట, దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ లతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ అనుచరులు ఉన్నారు. గెలుపోటములను నిర్ణయించగల నేతలు కావడంతో అధిష్టానం వీరి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. సస్పెండ్‌కు ముందు వీరు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు? ఆ తర్వాత ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నది. వీరితో సీనియర్లు కలిసిపోతే పార్టీకి నష్టమని ముందస్తుగా అలర్టైన అధిష్టానం నేతల కట్టడికి చర్యలకు దిగింది.
అలర్టైన పార్టీ అధ్యక్షులు
జూపల్లి, పొంగులేటిని పార్టీ సస్పెండ్ చేయగానే ఖమ్మం, పాలమూరు జిల్లాలకు చెందిన జిల్లా ఇన్ చార్జులు, పార్టీ అధ్యక్షులు అలర్టైయ్యారు. మిగతా నేతలు కూడా ఒకేసారి పార్టీని వీడితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో అసంతృప్తి నేతలను బుజ్జగించే పనుల్లో నిమగ్నమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే జూపల్లి, పొంగులేటికి సన్నిహితంగా ఉన్న నేతల వివరాలను సేకరించినట్లు.. పార్టీ అధిష్టానానికి నివేదికగా అందజేయనున్నట్లు సమాచారం. వీరి ఫోన్ల డేటాపైనా అధిష్టానం దృష్టిసారించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, నేతలతో పాటు కలిసివచ్చేవారందరితో కలిసి పోతామని జూపల్లి, పొంగులేటి స్పష్టం చేశారు. ఆ దిశగా పలువురు టచ్‌లో ఉండగా ఏ జిల్లాలో ఎవరూ ఉన్నారనే వివరాలను ఆరా తీస్తున్నది.
ఒకేసారి వేటు వేస్తే..
బీఆర్ఎస్‌లో పెరిగిన అసంతృప్తికి చెక్ పెట్టేందుకే ముందస్తుగా జూపల్లి, పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా..! అనే ప్రచారం ఊపందుకుంది. వీరి వెన్నంటి ఉండే నేతలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, విజయబాయి, పిడమర్తి రవి, రాజశేఖర్, రాంబాబు, వెంకట్రావ్, బ్రహ్మయ్య, గోపాలరావు తదితరులపై సస్పెండ్ వేటు వేయలేదు. ముందుగా ఇద్దరినే సస్పెండ్ చేస్తే పార్టీలో అసంతృప్తి తగ్గుతుందని.. ఆ దిశగానే చర్యలు చేపట్టారనే టాక్.
అందరిపై ఒకేసారి వేటు వేస్తే పార్టీతో పాటు ప్రజల్లోనూ నష్టం జరుగుతుందని భావించినట్లు సమాచారం. వీరిపై వేటు వేస్తే అంతా సర్దుకుంటుందని అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు పార్టీలోని ఓ సీనియర్ నేత తెలిపారు. మరికొంత సమయం వేచిచూసి తీరు మారకపోతే వేటువేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. జూపల్లి, పొంగులేటిని సస్పెండ్ పార్టీలో జోరుగా చర్చసాగుతుంది. ఇది ఎటు దారితీస్తుందోనని ప్రజలతోపాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: పొంగులేటి, జూపల్లి తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు?