వచ్చే ఎన్నికల్లో BRS కనుమరుగవడం ఖాయం: కాసాని జ్ఞానేశ్వర్ ఫైర్

by Satheesh |   ( Updated:2023-09-04 14:40:50.0  )
వచ్చే ఎన్నికల్లో BRS కనుమరుగవడం ఖాయం: కాసాని జ్ఞానేశ్వర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కరుమరుగవడం ఖాయమని, కేసీఆర్ తొమ్మిదేళ్లలో హామీలు తప్ప అమలు లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్నవారంతా టీడీపీ వారేనని.. ఆ పార్టీకి సొంత కేడర్ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలపై మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే మహా ధర్నా చేపట్టామన్నారు. టీడీపీ పాలనలో నాయకులపై, కార్యకర్తలపై మీడియాలో అవినీతి వార్తలు వస్తే విచారణ కమిటీ వేసి నివేదిక ఆధారంగా బాధ్యులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు ఉండేవన్నారు.

ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా వ్యవహారాలు.. అధికారం ఉన్నవారిదే రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. పేదల కోసం కట్టిన ఇళ్లను 9 ఏళ్లుగా పంపిణీచేయకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు పంపిణీ చేయడం ప్రజలను ఓట్ల కోసం మరోసారి మభ్య పెట్టేందుకేనని మండిపడ్డారు. ధరణి పోర్టల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, భూ సమస్యలపై లక్షల దరఖాస్తులు వచ్చినా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయల్లో అవి పరిష్కారం కాకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరేడు లక్షల కోట్ల అప్పులే కారణమన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నారని.. కానీ రాష్ట్ర బడ్జెట్ జీరో అని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని జీరో బడ్జెట్‌గా మార్చి.. అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌కు సున్నం పెట్టి, టీడీపీకి ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. ధర్నాలో పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, నాయకులు బంటు వెంకటేశ్వర్లు, టి.జ్యోత్స్న, కాసాని వీరేశ్, కాట్రగడ్డ ప్రసూన, జక్కిలి ఐలయ్యయాదవ్, నన్నూరి నర్సిరెడ్డి, సూర్యదేవర లత, భవనం షకీలా రెడ్డి, అశోక్ గౌడ్, పొలంపల్లి అశోక్, ఎంకే బోస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed