దమ్ముంటే కర్నాటకకు రా.. సీఎం కేసీఆర్‌కు డీకే శివకుమార్ సవాల్

by Satheesh |   ( Updated:2023-10-28 14:25:27.0  )
దమ్ముంటే కర్నాటకకు రా.. సీఎం కేసీఆర్‌కు డీకే శివకుమార్ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో/తాండూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ కర్నాటకకు వచ్చి చూడాలని సవాల్ విసిరారు. తాండూరు విజయభేరి బస్సు యాత్రలో ప్రసంగించిన డీకే.. ఇక్కడి నుంచి కర్నాటక పది కిలోమీటర్ల దూరమే. మీరు వస్తానంటే నేనే బస్సు ఏర్పాటు చేస్తా. అక్కడ మేము ఎన్నికలకు ముందు ఐదు హామీలు ఇచ్చాం. ఆ హామీలు అమలు అవుతున్నాయో లేదో చూపిస్తా. కర్నాటకలో ప్రతి ఇంటికి వెళ్లి చూద్దాం మేమిచ్చిన గ్యారెంటీ స్కీమ్స్ అమలు అవుతున్నాయో లేదో చూద్దామన్నారు.

మీరు వస్తామంటే మీరు చెప్పిన టైమ్‌కే బస్సు పంపిస్తానని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే అన్ని వర్గాలు పవర్‌లోకి రావడమే అని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను యూపీఏ ప్రభుత్వం అమలుచేసింది. పదేళ్ల క్రితం కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ చెప్పిన మాట ఈ పదేళ్లలో నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చేనాడు సోనియా గాంధీ అధికారం కోసం చూడలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

మైనార్టీలను కేసీఆర్ మోసం: రేవంత్

మైనార్టీ రిజర్వేషన్‌లు పెంచుతామని కేసీఆర్ వారిని మోసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టుల వల్లే హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందని అన్నారు. హైదరాబాద్‌కు మెట్రోరైల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

లంచాలు ఇచ్చినోనికే మంచాలు వేస్తున్నారని, లంచాలు ఇవ్వని స్థిరాస్తి వ్యాపారులను కేటీఆర్ అణిచివేస్తున్నారని, నగరానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రైతు రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు.

Advertisement

Next Story