‘స్థానిక’ ఎన్నికలపై ఫోకస్..బరిలో దిగేందుకు యువత ఆసక్తి

by Jakkula Mamatha |   ( Updated:2024-08-24 02:13:39.0  )
‘స్థానిక’ ఎన్నికలపై ఫోకస్..బరిలో దిగేందుకు యువత ఆసక్తి
X

దిశ,భిక్కనూరు:రాజకీయ నాయకులు, ప్రజాసేవ పై ఆసక్తి ఉన్న వారు దృష్టి పంచాయతీ ఎన్నికల పై పడింది. కొన్ని నెలల క్రితమే పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది. పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల పై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకులు, యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ గా ఈ సారి నిలబడాలనుకుంటున్నాను..ఎట్లుంటదంటవ్..అని అడుగుతూనే, ఇంకా ఎవరెవరు నిలబడుతున్నారని, ఇప్పటికే పలువురు పేర్లు వినబడుతున్నాయని, వారిలో ఎవరికీ ఛాన్స్ ఉంటుందని సీక్రెట్‌గా పలువురు ఆశావహులు సర్వే చేసుకుంటున్నారు. తనకు తెలిసినంత వరకు ప్రజల్లో తన పట్ల బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏమీ లేదని, పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందన్న నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ, టార్గెట్ సర్పంచ్ గిరి మాత్రం మిస్ కావద్దని పట్టుదలతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. పోటీలో ఎవరు నిలబడిన నిలబడలేకపోయిన, నేను మాత్రం పోటీలో దిగుతున్నారంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన వారు సైతం సర్పంచ్ పదవికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యులతో అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకొందరైతే హేమాహేమీలు సైతం తలపడేందుకు, ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కొందరు విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేస్తున్నారు. పైగా వారు చేసే కార్యక్రమాలు హైలెట్ చేసుకునేందుకు కొత్తగా గ్రూప్ క్రియేట్ చేస్తూ, సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు.

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీల్లో ఇప్పుడు ఈ రకమైన ట్రెండ్ జోరందుకుంది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న ఎంతోమంది యూత్, రాజకీయాల వైపు ఫోకస్ పెట్టడం వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులను చెమటలు పట్టిస్తోంది. ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతూ, రిజర్వేషన్ల వలన ఎటువంటి అవకాశాలు రాక ఎంతోమంది వెనకబడిపోయారు. ఇప్పుడు అవకాశం వచ్చిందన్న సంతోషంతో పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఇంకెవరు ఎవరు నిలబడుతున్నారని వివరాలను సైతం సేకరించి, బలం, బలహీనతల పై చర్చిస్తూ గెలుపోటములపై అప్పుడే లెక్క లేస్తున్నారు. పలు గ్రామాల్లో ఇప్పటికే యూత్ చేపడుతున్న కార్యకలాపాలను చూసి కొందరు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. పైగా పోటీకి ఎంత ఎక్కువ మంది నిలబడితే అంత తక్కువ ఖర్చుతో బయటపడవచ్చని ఉద్దేశంతో మరికొందరు పోటీకి దిగుతున్నారు. పోటీలో తప్పకుండా నిలబడాలని డిసైడ్ అయిన వారు మాత్రం ముందుగా ఈ విషయాన్ని వారి వారి కుల సంఘాల పెద్దలకు సభ్యులకు, తెలియజేస్తూ ఆ తర్వాత ప్రముఖులను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీ అయ్యారు.

గట్టి పోటీ తప్పదా..?

మేజర్ గ్రామ పంచాయతీలలో ఈసారి టఫ్ ఫైట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ పోటీ చేసేందుకు ముందుకు వస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ పరోక్ష మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఈసారి అన్ని గ్రామాల్లో బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ హై కమాండ్ నిర్ణయించడంతో, ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలువురు ఆశావహులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తానూ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పార్టీ మద్దతు తనకు లభించే విధంగా చూడాలని కోరుతున్నారు. అధిష్టాన పెద్దలు సైతం ఎవరు వచ్చినా కాదనకుండా, అందరికీ అభయమిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై ఉన్న ఖదర్‌ను చూసే చాలా మంది పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల్లో ఉంటే ఏదైనా సాధించవచ్చన్న నమ్మకంతో కొందరు, డబ్బు సంపాదనతో పాటు, పరపతి పెరుగుతుందని మరికొందరు, బ్రష్టు పట్టి పోయిన వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయ అండ అవసరమన్న ఉద్దేశంతో పలువురు సర్పంచ్ రేసులో నిలబడుతున్నారు.

Advertisement

Next Story