అంతా మా వాళ్లే...!

by Disha Web Desk 12 |
అంతా మా వాళ్లే...!
X

దిశ, హుజూరాబాద్ రూరల్: పోలీస్ ,రెవెన్యూ, గనుల శాఖ అంతా మా వాళ్లే.. మమ్మల్ని ఏమీ చేయలేరు. అనే ధీమాతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టిని అక్రమార్కులు తరలిస్తున్నారు. పామాయిల్ తోటలు పెట్టాలని హార్టికల్చర్ వద్ద నమ్మబలికి , భూమి చదును చేసుకోవాలని రెవెన్యూ అధికారుల వద్ద అనధికారిక అనుమతులు తీసుకున్నట్లు చెబుతూ యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తరలించుకపోతున్నారు. దీంతో భూముల ఆకృతి మారిపోయి బొందల గడ్డగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. సిర్సపల్లి శివారులో హుజూరాబాద్ పట్టణానికి కూతవేటు దూరంలో ఓ క్రషర్ వ్యాపారి తనకున్న మూడు ఎకరాల పట్టా భూమిని సర్వే నంబర్ 496లో సిర్సపల్లి శివారులో కొనుగోలు చేశారు. ఇట్టి భూమితో పాటు చుట్టుపక్కల దాదాపు పది ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో గుట్టల మధ్య మట్టిని తరలిస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నాడు.

నిబంధనలు ఉల్లంఘించడం లక్షల రూపాయలు అర్దించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అధికారుల అండదండలతో సహజ వనరులైన మట్టిని కొల్లగొడుతున్నారు. ప్రతిరోజు హుజూరాబాద్ పట్టణంతో పాటు శివారు గ్రామాలకు రెండు జేసీబీలతో 30 టిప్పర్లలో 300 టిప్పర్ల మట్టిని తరలించుకుపోతున్నాడు. ఒక్కొ టిప్పర్ కు రూ.7 నుంచి 8వేల వరకు వసూలు చేస్తున్నాడు. సిర్సపల్లి శివారు నాలుగు గుట్టల చుట్టూ ప్రభుత్వ భూములు బొందల గడ్డలుగా మారుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ అక్రమ మట్టి దందా సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసిన క్రషర్ యజమాని చేస్తున్నాడని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్యులపై మాత్రం వీరు ప్రతాపం చూపిస్తారని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ మట్టి మాఫియా నాయకుని పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రెవెన్యూ, గనుల శాఖకు భారీగా ముడుపులు

సిర్సపల్లి శివారులో మట్టి తరలిస్తున్న క్రషర్ యజమానితో రెవెన్యూ ,గనుల శాఖ అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తనిఖీ చేసి పట్టుకోవాల్సిన అధికారులే ఈ మట్టి అక్రమ దందాకు కొమ్ముకాస్తున్నట్లు సమాచారం. అక్రమ మట్టి దందా ఈ క్రషర్ యజమాని కనుసన్నలోనే జరుగుతుందని, ఇందుకు భారీగా ముడుపులు ముట్టాయని అధికార వర్గాలే బాహాటంగా పేర్కొంటున్నాయి. అక్రమంగా యథేచ్ఛగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు తెలిసినా అధికారులు తెలియనట్టు నటిస్తున్నారంటే దీని వెనుక పెద్ద తతంగం నడుస్తుందని వారు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed