ఢిల్లీలో కుస్తీ.. మల్కాజిగిరిలో దోస్తీ

by Disha Web Desk 15 |
ఢిల్లీలో కుస్తీ.. మల్కాజిగిరిలో దోస్తీ
X

దిశ, పేట్ బషీరాబాద్ : పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని, ఈ పార్లమెంటు ఎన్నికలలో 12 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే సంవత్సర కాలంలో రాష్ట్రంలో రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నియోజకవర్గ అభివృద్ధికి జోడెద్దులలాగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందాలకు మరొక శక్తిగా రాగిడి లక్ష్మారెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ఓటర్లు మాట నిలబెట్టుకునే వాళ్లని, సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇక్కడే జరిగిన మీటింగ్లో కేపీ వివేకానంద ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొరితే మీరందరూ దానిని సీరియస్ గా తీసుకొని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్

చీకటి ఒప్పందంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పడుతున్నా మల్కాజిగిరిలో దోస్తీ చేస్తున్నాయని విమర్శించారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని, ఒకరిని తాండూరు నుంచి తీసుకొస్తే ఇంకొక ఆయనని హుజూరాబాద్ నుంచి తీసుకొచ్చారని అన్నారు. ఓడిపోయినాక ఇద్దరు హుజూరాబాద్, తాండూర్ లకు వెళ్లిపోతారని పేర్కొన్నారు.

సిగ్గులేని రేవంత్..

హైదరాబాద్ నగరంలో ప్రతి సీటును గులాబీ పార్టీకి అప్పగించి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఓటర్లు చాటుకున్నారని, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోర్టింగ్ లు పెట్టుకొని ఆరు గ్యారెంటీలను అమలు చేసేశామని డప్పు కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? వృద్ధులకు 4వేల పెన్షన్ అందిందా..? ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా..? రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా..? 500 ఈ బోనస్ వచ్చిందా..? ఫ్రీ స్కూటీ అందిందా..? అంటూ ప్రశ్నించారు. హామీల సంగతి ఏమో కానీ కాంగ్రెస్ లూఠీ మాత్రం చాలా చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో

వారానికి ఒకసారి ఏదో ఒక పరిశ్రమ రాష్ట్రానికి తరలివచ్చేదని, కానీ నేడు నాలుగు నెలలు దాటిపోయినా కొత్త ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలు గుజరాత్, చెన్నై లకు తరలిపోతున్నాయని తెలిపారు. కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎటూ లేదని, ఉన్న పరిశ్రమలను సైతం కాపాడుకోలేని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటు కోతలు పెరిగాయని, ఇన్నాళ్లుగా కనిపించని ఇన్వర్టర్లు, జనరేటర్లు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. అందరి ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేస్తాను అన్న మోడీ 120 నెలల కాలంలో ఎవరికి కూడా కనీసం 120 రూపాయలు వేయలేదని, రేవంత్ రెడ్డి సైతం 150 రోజుల పరిపాలనలో 2000 రూపాయలు కూడా వేయలేదని అన్నారు. బడా భాయ్ రెండు కోట్ల ఉద్యోగాల విషయంలో మోసం చేస్తే, ఇక్కడ చోటా భాయ్​ ఎంత పెద్ద మోసగాడో అందరికీ ఇప్పటికే అర్థమైందని అన్నారు.

బిజెపికి ఓటు అడిగే హక్కు లేదు

10 సంవత్సరాల పాలనలో బీజేపీ వారు హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదని, వరదలు వచ్చినా, మెట్రో నిర్మాణానికి రూపాయి సాయం చేయలేదని అన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధి పనుల్లో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని వారికి ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. ముస్లింలను ఉదేశపూర్వకంగానే మోడీ అవమానిస్తున్నారని, ఎక్కువ పిల్లల్ని కంటారు వారికే సంపద ఎక్కువ వెళుతుందని అనే దివాలా కోరు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని అన్నారు. అందరూ కలిసి ఉండే విశ్వనగరంగా హైదరాబాద్ ఉండాలా లేదా బీజేపీ గెలిచి హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయ విషనగరం కావాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఆ సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని పేర్కొన్నారు.

ఏ కూటమిలోకి చేరేది లేదు

బీఆర్ ఎస్ పార్టీ 12 ఎంపీ సీట్లలో గెలిస్తే వెళ్లి ఎన్డీఏలో చేరిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తాము ఏ కూటమిలో చేరేది లేదని ఈ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని పార్టీలు దేశంలో 13 ఉన్నాయని, అందులో బీఆర్ఎస్, బీజీయు జనతాదళ్ , వైఎస్ఆర్​సీపీ వంటి పార్టీలు అనేకం ఉన్నాయని, ఈ 13 పార్టీలే ఢిల్లీ రాజకీయాలను శాసించొచ్చు అని అన్నారు. కవితను జైలులో పెట్టిన బీజేపీతో కలిసే దౌర్భాగ్యం లేదని, ఆ పార్టీతో కలిసి వెళ్లే కర్మ నిన్నటి వరకు లేదని, రేపు కూడా ఉండదని కచ్చితంగా చెప్పుకొచ్చారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో పాలనగా మారిందని, ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ మాటలకు మోసపోకండి : రాగిడి లక్ష్మారెడ్డి

రోడ్డు షో లో కేటీఆర్ ప్రసంగానికి ముందు మల్కాజిగిరి బీఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందంజలో ఉంచిన ఘనత కేసీఆర్ దే అని, ప్రపంచ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన ఘనత కేటీఆర్ కు చెందుతుందని తెలిపారు. ఇంతకుముందు

ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందేనని, మరొకమారు ఆయన మాయమాటలకు మోసపోవద్దు అని హెచ్చరించారు. తాను స్థానికంగా ఉంటానని కానీ బీజేపీ అభ్యర్థి ఇక్కడ వాడు కాడుదని, ఇంతకుముందు స్థానికేతరుడైన రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఏం చేశాడో మీ అందరికి తెలుసని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న తనని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని లక్ష్మారెడ్డి కోరారు.

Next Story

Most Viewed