సిరిపూర్ సొసైటీలో రూ.2 కోట్లు స్వాహా..! విచారణలో అధికారుల కాలయాపన

by Shiva |
సిరిపూర్ సొసైటీలో రూ.2 కోట్లు స్వాహా..! విచారణలో అధికారుల కాలయాపన
X

దిశ, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిధిలోని సిరిపూర్ సొసైటీలో జరిగిన రూ.2.15 కోట్ల కుంభకోణం లెక్క నేటికి తేలలేదు. నిజానిజాలు తేల్చి ఆ సొమ్మును రికవరీ చేయవలసిన అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నత్తనడకన కొనసాగుతోన్న విచారణ తీరుతో నష్టపోయిన రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. రైతుల డబ్బు స్వాహా చేసిన వ్యక్తికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఇదంతా జరుగుతోందన్న వాదనలు లేకపోలేదు. జిల్లా స్థాయి అధికారులు కలగజేసుకుని బాధ్యులపై చర్యలు చేపట్టడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

నత్తనడకన విచారణ

సొసైటీలో జరిగిన కుంభకోణం విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన అధికారులు రెండేళ్ల క్రితం క్రితం అప్పటి సీఈవో ఆస్తులు సర్చేజ్‌తో జప్తు చేశారు. అందులో భాగంగా గత సీఈవోకు చెందిన మెట్‌పల్లి మండలం అమ్మక‌పేట గ్రామంలో 3 మూడెకరాల 11 గంటల భూమికి వేలం నిర్వహించారు. ఆ వేలంలో రూ.60 లక్షలతో ఓ రైతు ఆ వేలం‌పాటలో ఆ భూమిని సొంతం చేసుకున్నాడు. అయితే, వేలం జరిగి సంవత్సరం గడుస్తున్నా.. ఆ రైతుకు అధికారులు పట్టా చేయడంలో విఫలం అయ్యారు. సర్చెజ్ ఆర్డర్ వచ్చాక మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామం‌లో ఎకరం 20 గుంటల భూమిని కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత సీఈవో రిజిస్ట్రేషన్ చేశాడానే ఆరోపణలు ఉన్నాయి. సర్చేజ్ ఆర్డర్ అధికారులు జారీ చేశాక ఆ భూమిని పట్టా ఎలా చేశారు.. ఆ పట్ట మార్పిడిలో ఎవరి ప్రమేయం ఉందో అధికారులు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో తెలుస్తోంది.

రైతుల పేరిట క్రాప్ లోన్ ..

గతంలో పని చేసిన సీఈవో రైతుల ప్రమేయం లేకుండానే వారి పేరున క్రాప్ లోన్లు తీసుకుని సొంత అవసరానికి వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సొసైటీ డేటా‌కు ఆన్‌లైన్ వ్యవస్థ లేకపోవడం‌తో కొందరు సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే, ప్రతి ఏటా నిర్వహించే ఆడిట్ లోనూ లెక్కల్లో తేడా ఉన్న విషయం ఎందుకు బయటపడలేదు అని అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. కొందరు అధికారుల సపోర్ట్‌తోనే రూ.కోట్లు కొల్లగొట్టి వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు‌గా స్పష్టం అవుతుంది. మామూలుగా లోన్ పేమెంట్లలో జాప్యం చేస్తే రైతుల పట్ల నోటీసులు ఇచ్చి కఠినంగా వ్యవహరించే ఆఫీసర్లు రూ.కోట్ల కుంభకోణం జరిగినా అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు డిపాజిట్లు చేసిన రైతులకు కాల వ్యవధి పూర్తయినా డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో సొసైటీ ఉంది.

డీసీవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గత నెల 20న సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అందులో నిరాహార దీక్ష తీర్మానాన్ని చైర్మన్ ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అందులో ఈనెల 5న నుంచి 11న వరకు నిరాహార దీక్ష చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలుసుకున్న డీసీవో సొసైటీ చైర్మన్‌కు రూ.45 లక్షల లెక్క చూపడం లేదని నోటీసులు జారీ చేశారు. తమ దీక్షను ఆపాలనే డీసీవో తమకు నోటీసులు జారీ చేశాడని, ఆ నోటీసులు కక్షపూరితంగానే డీసీవో జారీ చేశారని అందులో నిజం లేదని, డీసీవోపై సొసైటీ చైర్మన్ బద్దం అంజిరెడ్డి శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు.

అర్థనగ్న ప్రదర్శన చేసిన సొసైటీ పాలకవర్గ సభ్యులు..

నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం రోజున సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు అర్థనగ్న ప్రదర్శన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. డిసిఓపై చర్యలు తీసుకొని న్యాయం చేసే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని చైర్మన్ అంజిరెడ్డి తెలిపారు.

రైతులను తప్పుదోవ పట్టించడానికే దీక్ష డ్రామా

మల్లాపూర్ మండలం సిర్‌పూర్ సహకార సంఘంలో చైర్మన్ రూ.45 లక్షలు అవినీతికి పాల్పడి దీక్ష చేయడం సరికాదని సిరిపూర్ మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.45 లక్షల అవినీతి జరిగినట్లుగా అధికారం నిర్ధారించి రికవరీ చేయాలని చైర్మన్ అంజిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతోనే దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు సమాధానం చెప్పలేక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. చైర్మన్‌పై జారీ చేసిన నోటీసుల నుంచి తప్పించుకోవడానికి రైతులను తప్పుదోవ పట్టించడానికి దీక్ష డ్రామాకు తెరలేపారని అన్నారు. - సిరి‌పూర్ మాజీ సర్పంచ్ నల్ల బాపు రెడ్డి

Advertisement

Next Story

Most Viewed