రామగుండంలో ఆపరేషన్ కూల్చివేతలు..హైడ్రా తరహాలో చర్యలకు సన్నద్ధం

by Aamani |
రామగుండంలో ఆపరేషన్ కూల్చివేతలు..హైడ్రా తరహాలో చర్యలకు సన్నద్ధం
X

దిశ,గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలు యంత్రాంగం మరింత దూకుడు పెంచుతోంది. హైడ్రా తరహా చర్యకు సన్నద్ధం అవుతుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో గతంలో వెలసిన నిర్మాణాలపై సర్వే కొనసాగుతున్నది. ఇప్పటికే రామగుండం ఎన్టిపిసి సమీపంలోని మల్కాపూర్ పరిధిలోగల మల్లపురాని కుంటలు చేపట్టిన దాదాపు 17 నిర్మాణాలకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎఫ్టియల్ గా నిర్ధారించి నోటీసులు జారీ చేశారు. ఇంకా అక్కడే మరిన్ని నిర్మాణాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంట వెంటనే కూల్చివేతకు ఒడిగడుతుండడం ప్రజల్లో ఆందోళనకు గురవుతున్నారు. గోదావరిఖని తిలక్ నగర్ ఏరియాలో కూడా నాలుగు రోజుల కిందట రోడ్డు ఆక్రమిత దాదాపు పది షాపులను జెసిబి సాయంతో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. నగరంలో మరి ఎక్కడ బఫర్ జోన్లను గుర్తించేందుకు అధికారులు సర్వే ను కొనసాగిస్తున్నారు.

అడ్డగుంట పల్లి చెరువు సేఫ్ జోన్ లో ఉండడం పై అనుమానాలు

కాగా హైడ్రా తరహా చర్యలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో కనుక చేపడితే ముందుగా అడ్డగుంటపల్లి చెరువులోని అక్రమ నిర్మాణాలు పేకమెడల కూలిపోతాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం అడ్డగుంట పల్లి సేఫ్ జోన్ లో ఉన్నట్లు అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 30 ఏళ్ల క్రితం మడ్డగుంటపల్లి చెరువు ఇప్పుడు మాయమై అక్కడ పలు భవనాలు వెలిశాయి. ఒకప్పుడు అక్కడ చెరువు ఉండేదని ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని భవనాలు నిర్మించారని గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలు చేపడితే ముందుగా అడ్డగుంటపల్లిలోనే నిర్మాణాలు తొలగిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులో బఫర్ జోన్ గా ఉంటే... రెవెన్యూ రికార్డులో మాత్రం పట్టా భూములుగా ఉండడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అడ్డగుంట పల్లి చెరువులోని భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేయలేకపోతున్నారు.

నాలాలపై నిర్మాణాలు కూడా తొలగించాలని డిమాండ్..

గోదావరిఖని నగరంలోని మార్కండేయ కాలనీ, దుర్గా నగర్, కళ్యాణ్ నగర్, మేధర బస్తీ తదితర ప్రాంతాలలోని ప్రధాన నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వేలు కూడా చేస్తున్నారు. నాళాల పై గల అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలు చేపడితే గోదావరిఖనిలో దాదాపు 200 పైచిలుకు భవనాలు కూల్చివేయాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే లక్ష్మీ నగర్ లోని వికే రెడ్డి హోటల్ లైన్ లో గల దుకాణాలను సైతం త్వరలోనే కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

Next Story