ఆ రెండు పార్టీలను బహిష్కరించండి: ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపు

by srinivas |
ఆ రెండు పార్టీలను బహిష్కరించండి: ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రతాపాన్ని పేదల ఇండ్లపై కాకుండా అనేక చెరువుల్లో బడా బాబులు, రాజకీయ వేత్తలు నిర్మాణాలు చేశారని వాటిపై ఆయన ప్రతాపం చూపాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగల, దోపిడీ పార్టీలని మండిపడ్డారు. హైడ్రా అంటే రేవంత్ రెడ్డేనని ఆయన పోల్చారు. ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూలుస్తున్నారని, వారి పిల్లలకు విద్యా సంవత్సరం లేదా అని ప్రశ్నించారు. ఇల్లు కూలిస్తే అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎక్కడికి పోవాలని నిలదీశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు గతంలో కేసీఆర్ ఇలాగే వ్యవహరించాడని, ఇపుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతోందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో ఆర్ఆర్, ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. పేదవారి ఇండ్లపై గడ్డపార పడితే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రాహుల్ చెప్పారని, హైడ్రా కూల్చివేతలపై ఆయన సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలు, మహిళల గురించి మాట్లాడడం ఆ రెండు పార్టీలకు అలవాటైందని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. కేసీఆర్ దాన్ని మొదలుపెడితే.. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారిని మీడియా.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కోరారు. అలా వ్యాఖ్యానించిన వారి మాటలు టెలికాస్ట్ చేసినన్ని రోజులు ఆ నేతల తీరు మారదని పేర్కొన్నారు. రాజకీయాలు ఎంత దిగజారుతున్నాయనేందుకు కొందరు నేతల చౌకబారు వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాలను మరింత దిగజార్చారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్.. ఫోన్ ట్యాపింగ్ తో అనేక కుటుంబాల అంతర్గత విషయాలు విన్నారని కోర్టులో అఫిడవిట్ వేశారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు రెండు పార్టీలను బహిష్కరించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story