పురుషులకంటే మహిళా ఓటర్లే అధికం

by Gantepaka Srikanth |
పురుషులకంటే మహిళా ఓటర్లే అధికం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేయకపోయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం సన్నాహాల్లో నిమగ్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపొందించిన జాబితాకు అనుగుణంగా ముసాయిదా జాబితాను రూపొందించి ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకుని తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రం మొత్తం మీద 1.67 కోట్ల (1,67,33,584) మంది ఓటర్లు (గ్రామీణ) ఉన్నట్లు పేర్కొన్నది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 10.42 (10,42,545) లక్షల మంది ఓటర్లు ఉంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేవలం 64,397 మందే ఉన్నారు. పట్టణ ప్రాంతం కావడంతో గ్రామీణ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నది. రాష్ట్రం మొత్తం మీద 538 మండలాల పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డులవారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే పంచాయతీ కార్యాయాలు, మండలాఫీసుల్లో ప్రజల కోసం డిస్‌ప్లేలో ఉంచింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇకపైన అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఇదే తుది జాబితా అని నొక్కిచెప్పింది.

మొత్తం ఓటర్లలో పురుషులకంటే మహిళలే 3,24,055 మంది ఎక్కువగా ఉన్నారు. థర్డ్ జెండర్‌ ఓటర్లు 493గా తేలింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీలు 856 ఉంటే కనిష్టంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేవలం 34 ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఆయా మండలాలు, పంచాయతీల్లోనివారు వెబ్‌సైట్ ద్వారా చూసుకునే వెసులుబాటు ఉన్నది.




Next Story