కేసీఆర్ పెద్ద గుంటనక్క : MP Dharmapuri Arvind

by samatah |   ( Updated:2022-12-30 10:56:14.0  )
కేసీఆర్ పెద్ద గుంటనక్క : MP Dharmapuri Arvind
X

దిశ, జగిత్యాల, బీర్పూర్ : దేశాన్ని దోచుకునేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని దోచుకోవడంలో కేసీఆర్‌ను మించిన గుంటనక్క మరెవరు లేరంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్ బీర్పూర్ మండలంలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేక పాలన నడుస్తుందని భైంసా పట్టణం రోహింగ్యాలకు బంగ్లాదేశీయులకు అడ్డగా మారిందని ఆరోపించారు. హిందుత్వం కోసం పోరాడే వాళ్లను సీఎం కేసీఆర్ జైళ్లలో వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడతామని అందుకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉందన్నారు. కాషాయ ఉద్యమం మారుమూల గ్రామాల నుండే మొదలైందని అందులో భాగంగానే ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టేందుకు ముందుకు వస్తున్నామని అరవింద్ తెలిపారు. మరోవైపు రోళ్ల వాగు కట్ట తెగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం కేసీఆర్ పాలనకు నిదర్శనం అన్నారు. 60 కోట్లతో చేపట్టిన పనులు 130 కోట్లకు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్లు అప్పజెప్పడం కోసమే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రం ఏర్పడితే రైతులను ఆదుకుంటామని అబద్ధపు హామీలు ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టు ఒక్కటీ కూడా నిర్మించలేదని ఏమైనా అంటే పేపర్లకే పరిమితమైన కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.వారం రోజుల్లో నాట్లు వేసే ప్రక్రియ పూర్తికావస్తున్నప్పటికీ ఇప్పటివరకు యాసంగి పంటకు నీరు ఇవ్వలేదని ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల మరమ్మతుకు డబ్బులు లేని పరిస్థితి నెలకొందని అరగుండాల,రోళ్ల వాగు ప్రాజెక్టు‌లే అందుకు నిదర్శనం అన్నారు. మోడీ లాంటి పాలన రాష్ట్రంలో కూడా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. చత్రపతి శివాజీ ఆశయాల స్థాపనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జగిత్యాల పట్టణంలో ఎంపీ అరవింద్ మొదట ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌కి నివాళులు అర్పించి స్థానిక బీఎల్ఎన్ గార్డెన్‌లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా శిక్షణ తరగతుల్లో నాయకులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Next Story