రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్

by Sridhar Babu |   ( Updated:2024-11-17 11:13:50.0  )
రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజించే వేములవాడ రాజన్కి శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2017లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. 2016లో మిడ్ మానేరులో భూములు కోల్పోయిన 12 ముంపు గ్రామాల ప్రజల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల 50 వేల రూపాయలు ఇస్తానని ఆశల పల్లకి ఎక్కించి 8 ఏళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న క్రమంలో అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి భరోసాను కల్పించడానికి వచ్చి ఉద్యమంలో పాల్గొని నిర్వాసితులతో రాత్రి నిద్ర చేసినట్లు గుర్తు చేశారు.

సీఎల్పీ హోదాలో భట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉండి ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇండ్లు మంజూరు చేస్తూ రూ.236 కోట్ల 80 లక్షల నిధులు విడుదల చేసిందని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది మాసాల్లోనే ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిందన్నారు.

మంచి పనులు చేస్తే మద్దతిస్తామన్న కేసీఆర్, కేటీఆర్ తమ హయాంలో చేయలేని పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలపాలని సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోతామన్నారు. ఈనెల 20న వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉందని, రాజన్న ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed