అక్రమ దందాకు అండదండలు

by Prasanna |
అక్రమ దందాకు అండదండలు
X

దిశ, మానకొండూర్ : ఊటూర్ మానేరు వాగులో (ఇసుక) ప్రకృతి సహజసంపద అక్రమార్కులకు సొత్తుగా మారింది. వారసత్వ హక్కు అన్నట్టుగా కొంతమంది దళారులు వ్యవహరిస్తున్నారు. కాగా ఇసుక అక్రమ దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నట్టుగా సాగుతోంది. అక్కడ అడ్డు చెప్పరు.. అడిగే వారు ఉండరు. ఇదే అదునుగా ఇసుకరీచ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను వాగునుంచి తోడేదెంత..? బయటకు తరలించింది ఎంత? అనే దానిపై ఎవరికి పట్టింపు ఉండదు. కాగా, మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుంటే అడ్డదారిలో దళారులు తమ అక్రమ దందాను మూడు బిల్లులు.. ముప్పై ట్రిప్పులు అన్నట్టుగా సాగిస్తున్నారు. ఈ అక్రమ దందాతో ప్రకృతి సంపదను కొళ్లగొడుతున్నారు.

నిరంతరం సాగుతున్న దోపిడీ..

మానేరు వాగులో ఇసుక తవ్వకాలను నేషనల్ గ్రీన్ ట్రిభ్యునల్ నిలిపేయడంతో కొద్దిరోజులుగా ఆగిన ఇసుక తవ్వకాలు కోర్టు ఆదేశాలతో మళ్లీ మొదలయ్యాయి. కాగా ఇదే అదునుగా బావించిన ఇసుకరీచ్ నిర్వాహకులు అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతున్నారు. అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వే బిళ్లులు లేకుండానే ఇష్టానుసారంగా ఇసుక లారీలను తరలిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైనా అనుకోకుండా తనిఖీలు జరిగితే తప్పించుకునేందుకు డమ్మి వే బిళ్లులు తయారు చేసి లారీలను సాగనంపుతున్నట్టు తెలుస్తోంది. అలా తయారు చేసిన ఒకే వే బిల్లుతో పదుల సంఖ్యలో లారీలను తరలిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థరాత్రులు ఇసుక తరలించడం అధికారులు పట్టించుకోకపోవడంతో వారి అక్రమ దందా మూడు బిల్లులు.. ముప్పై ట్రిప్పులు అన్నట్టుగా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ఇసుక తరలింపుపై కనిపించని పర్యవేక్షణ..

రూ.కోట్ల సహజసంపదను కొంతమంది దళారులు రీచ్‌ల పేరుతో కొళ్లగొడుతున్నారు. కాగా, ఈ దందాను పర్యవేక్షిస్తూ కట్టడి చేయాల్సిన అధికారులు రీచ్ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదునుగా దళారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతుండగా రూ.కోట్లు వెచ్చించి ప్రజా రవాణా కోసం ప్రభుత్వం నిర్మించిన రహదారులు సైతం ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజా రవాణాకు అడుగడుగునా తీవ్ర అంతరాయం వాటిళ్లుతుంది. పర్మిట్ దందా పేరుతో నిర్వాహకులు అధికారులను పక్కదారి పట్టిస్తుండగా అక్రమ దందాతో అవస్థలు పడుతున్న జనం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

Next Story