కేసీఆర్ తెలంగాణలో తిరగలేకే పక్క రాష్ట్రాలకెళ్లి పరువు తీస్తుండు : కొండా

by Nagaya |   ( Updated:2022-09-02 14:33:33.0  )
కేసీఆర్ తెలంగాణలో తిరగలేకే పక్క రాష్ట్రాలకెళ్లి పరువు తీస్తుండు : కొండా
X

దిశ, మానకొండూర్: కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్నారని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో తిరగలేకనే పక్క రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.

బీహార్ మీడియా సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని, అక్కడ సీఎం తెలంగాణ పరువు తీశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని అన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేసీఆర్‌ను పట్టించుకోలేదని.. ఆయన తెలంగాణా పరువు తీశారన్నారని విమర్శించారు. బీహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారన్నారు. తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే సీఎం బీహార్ పర్యటనకు వెళ్లారని, బీహార్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుందన్నారు.

గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదని, మరి తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్, ఫాంహౌస్‌కే పరిమితమై అదే ప్రపంచమనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని సీఎం పాలనను ప్రజలు గమనిస్తున్నారని, మునుగోడు భయం కేసీఆర్ కు బాగా పట్టుకుందని తెలిపారు. తెలంగాణ వస్తే ముందుగా కరీంనగర్ బాగుపడుతుందని అనుకున్నానని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందుకు భిన్నంగా అభివృద్ధి నోచుకోకుండా ఉన్నదని అన్నారు.

ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గానికి బై ఎలక్షన్‌లో గెలవడం కోసం వరాల జల్లు కురిపించిన ప్రభుత్వం మిగితా నియోజకవర్గాలపై ఎందుకు దృష్టి పెట్టలేక పోతుందని ప్రశ్నించారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే అక్కడ వరాల జల్లు కురిపించడమే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న సోయి లేదన్నారు. దీనికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక అని తెలిపారు.

తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమం చేసిన రసమయి బాలకిషన్ ఈనాడు మానుకొండూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రసమయి నిజమైన ఉద్యమకారుడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుండాలని సూచించారు. ఈకార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాంగాడి కృష్ణారెడ్డి, గడ్డం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కర చారి, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

NTR టార్గెట్‌గా మరోసారి రాజకీయ రచ్చ.. కేసీఆర్ సర్కార్ గురి పెట్టిందా?

Advertisement

Next Story

Most Viewed