ఎన్నికల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-13 11:03:54.0  )
ఎన్నికల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,సిరిసిల్ల : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పనిచేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ, మీడియా సెంటర్ లను ఆయన అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్పక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ లదే కీలక పాత్ర అన్నారు. ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. సి - విజిల్ ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్ర స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి విభాగానికి వేరువేరుగా రికార్డ్ లను నిర్వహించాలన్నారు.

ఎన్నికల ప్రకటనలు, ప్రచారాలపై నిఘా పెట్టాలి

ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, ప్రచారాలపై మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఎంసీఎంసీ బాధ్యులకు సూచించారు. ఎంసీఎంసీ సభ్యులు నిరంతరం వివిధ వార్తా పత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసారామాద్యామాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. ప్రకటనలకు సంబంధించి యంసియంసి అనుమతి పొందే విధంగా చూడాలన్నారు. ప్రకటనలకు అయ్యే ఖర్చులను పార్టీల ఖాతాలలో జమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం , జిల్లా కార్మిక అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ వినోద్, సీపీఓ పీబీ శ్రీనివాస చారి, ఏవో రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed