పండుటాకుల పై కర్కశత్వం..

by Sumithra |   ( Updated:2024-12-28 03:56:26.0  )
పండుటాకుల పై కర్కశత్వం..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలి పట్ల ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించేందుకు వారం రోజుల క్రితం భార్య మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్ గా ఉంది. ఈ క్రమంలో బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్ పై పడుకుంటుంది.

అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఇది పేషంట్ కు మాత్రమే కేటాయించిన బెడ్ అని విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను గురువారం వీల్ చైర్ లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనర్సు భార్యను వెతుక్కుంటూ వచ్చి రోడ్డు పై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి ఇద్దరినీ తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది వృద్ధురాలి పై వ్యవహరించిన తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల పట్ల అలసత్వం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములును ఇటీవలే జిల్లా కలెక్టర్ సరెండర్ చేసినప్పటికీ సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed