Magnus Carlsen : జీన్స్ వివాదం.. మగ్నస్ కార్ల్‌సన్ నిష్క్రమణ

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-28 16:22:52.0  )
Magnus Carlsen :  జీన్స్ వివాదం.. మగ్నస్ కార్ల్‌సన్ నిష్క్రమణ
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చెస్ నెం.1 ఆటగాడు మగ్నస్ కార్ల్‌సన్ వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్-2024 నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. జీన్స్ వేసుకుని వచ్చి డ్రెస్ కోడ్ ఉల్లంఘించడంతో ఫిడే(అంతర్జాతీయ చెస్ సమాఖ్య) కార్ల్‌సన్‌కు 200 డాలర్లు జరిమానాగా విధించినట్లు ధ్రువీకరించింది. ఈ వివాదంపై కార్ల్‌సన్ స్పందిస్తూ.. ‘ నేను రేపు జీన్స్ మార్చుకుంటా అని చెప్పాను. కానీ వారు ఇప్పుడే మార్చుకోవాలన్నారు. అలా చెప్పడం ఇబ్బందిగా అనిపించింది. ఫిడేతో విసిగిపోయా.. వారితో ప్రయాణం చేయాలనకోవడం లేదు. ఫిడే రూల్స్ దారుణంగా ఉన్నాయి. అసలు జీన్స్ వేసుకున్న విషయాన్నే నేను మర్చిపోయాను. వారి నిర్ణయం సరిగా లేదు. బ్లిట్జ్ చాంపియన్ షిప్ నుంచి తప్పుకుంటున్నా..’ అని కార్ల్‌సన్ అన్నాడు.

బ్యాన్ చేయలేదు.. ఫిడే సీఈవో

మగ్నుస్ కార్ల్‌సన్‌ను టోర్నమెంట్ నుంచి బ్యాన్ చేయలేదని ఫిడే సీఈవో ఇమిల్ సుటోస్కీ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. ‘తొమ్మిదో రౌండ్‌లో అతను ఆడలేదు. నేడు(ఆదివారం) అతను ఆడొచ్చు. బట్టలు మార్చుకోవడానికి కార్ల్‌సన్‌కు కావాల్సినంత సమయం ఇచ్చాం. అందరికి ఒకే నియమాలు వర్తిస్తాయి. డ్రెస్ కోడ్‌ను గౌరవించే ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. గతంలో కూడా జరిమానాలు విధించాం. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాం. మాగ్నస్ నిస్సందేహంగా టోర్నీలో పాల్గొనవచ్చు.’ అని ఆయన అన్నాడు.

Advertisement

Next Story