TG: హెచ్ఎంలు అనుభవంతో పనిచేయాలి.. పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి

by Ramesh Goud |
TG: హెచ్ఎంలు అనుభవంతో పనిచేయాలి.. పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాశాఖ ఆకాంక్షలను అందుకోవడానికి ప్రధానోపాధ్యాయులు వారి అనుభవాన్ని జోడించి పనిచేయాల్సిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు పీవీ నరసింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో భాగంగా నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని గర్వంగా ప్రకటించుకుని వృత్తికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలోని పీఎంశ్రీ పాఠశాలలు దేశంలోనే అగ్రస్థాయిలో నిలవాలని, దానికి ప్రధానోపాధ్యాయులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే అటల్ టింకరింగ్ సైన్స్ ల్యాబ్స్, గ్రంథాలయాలు మొదలైనవి నిరంతరం పిల్లలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. హరిత పాఠశాల భావనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వివిధ పాఠశాలలు తీసుకున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దేశం అభివృద్ధి చెందడానికి పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని వారి అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించబడిన బడ్జెట్ ను చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష అదనపు పథక సంచాలకులు రాధారెడ్డి, సంయుక్త సంచాలకులు రాజీవ్, వెంకట నరసమ్మ, సమగ్ర శిక్ష రాష్ట్ర సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed