JP Nadda: చౌకుబారు రాజకీయాలు మానుకోవాలి.. కాంగ్రెస్ విమర్శలకు నడ్డా కౌంటర్

by Shamantha N |
JP Nadda: చౌకుబారు రాజకీయాలు మానుకోవాలి.. కాంగ్రెస్ విమర్శలకు నడ్డా కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(Manmohan Singh)కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆరోపణలపై బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా(BJP president JP Nadda) స్పందిస్తూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్‌ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్‌ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్‌ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్‌ ప్రధానిగా వ్యవహరించి ఆ పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్‌ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్‌ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు

కాంగ్రెస్ ని క్షమించరు

పీవీ మరణంపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని నడ్డా ఆరోపించారు. ‘పీవీ మరణం తర్వాత ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లో 'సమాధి స్థల్' (స్మారక చిహ్నం) నిర్మించాలనే డిమాండ్ వచ్చింది. కానీ, సూపర్ పీఎం సోనియా గాంధీ దానిని ఆమోదించలేదు. నరేంద్ర మోడీ మాత్రం 2015లో పీవీకి స్మారకం నిర్మించి, 2024లో భారతరత్న ఇచ్చి సత్కరించింది. ఒక నివేదిక ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలోని దాదాపు 600 ప్రభుత్వ పథకాలు, విద్యా సంస్థలు, అవార్డులు, రోడ్లు, జాతీయ పార్కులు, మ్యూజియంలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, భవనాలు, క్రీడలకు నెహ్రూ-గాంధీ కుటుంబం పేరు పెట్టాయి. ఇతర వ్యక్తుల పేర్లతో పథకాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సిద్ధాంతాలు లేని కాంగ్రెస్ చారిత్రక పాపాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు. క్షమించదు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నాయకులందరూ లాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలి' అని నడ్డా అన్నారు.

Advertisement

Next Story