చెరువులో పాల డెయిరీ నిర్మాణం.. హైడ్రాను ఏర్పాటు చేయాలని డిమాండ్

by Mahesh |
చెరువులో పాల డెయిరీ నిర్మాణం.. హైడ్రాను ఏర్పాటు చేయాలని డిమాండ్
X

దిశ, గన్నేరువరం: గడచిన పదేళ్లలో ఆక్రమణలకు కాదేది అనర్హం అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ అక్రమణలు జరిగాయి. చెరువులు, కుంటల ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా అమలుకు నోచుకోకపోవడంతో అక్రమార్కులు చెరువులు, కుంటలను సైతం వదలకుండా ఆక్రమించుకున్నారు. అయితే అధికారం అడ్డు పెట్టుకుని ఆక్రమించుకున్న వారు కొందరైతే వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని ఆక్రమించుకున్న వారు మరి కొందరు. అయితే అందుకు భిన్నంగా కరీంనగర్ పాల డెయిరీ నిర్వాహకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమణలకు శ్రీకారం చుట్టారు. చెరువులను కుంటలను వదలకుండా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఓ వైపు అధికారం.. మరో వైపు స్థానికంగా కొంతమంది రైతుల అవసరాలను అడ్డుపెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఓ చెరువును ఎంచుకుని పాల కేంద్రాన్ని నిర్మించారు. అప్పుడు అధికారం వారి చేతిలో ఉండటం చేత అడ్డు చెప్పినా అక్రమణ ఆగలేదు. అయితే హైదరాబాద్ లో హైడ్రా చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తుండటంతో ఆ తరహా చర్యలకు కరీంనగర్ జిల్లాలో డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.

చెరువులో పాల డెయిరీ తొలగించాలంటున్న గ్రామస్తులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి దేవుని చెరువులో సుమారు 10 గుంటలు ఆక్రమించి కరీంనగర్ డెయిరీ పాల కేంద్రం నిర్మించి దశాబ్ద కాలం అయినప్పటికీ చెరువు భూమి కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు. సర్వే నెంబర్ 295 లో 11 ఎకరాల ఒక గుంట విస్తీర్ణంతో దేవుని చెరువు ఉండగా.. . సుమారు 10 గుంటలకు పైగా పాల కేంద్రం నిర్వాహకులు కబ్జా చేశారు. అక్రమంగా నిర్మించిన పాల కేంద్రాన్ని కూల్చివేసి కబ్జాకు గురైన చెరువు భూమిని తిరిగి తీసుకొని చెరువును పునరుద్ధరించాలని మండల సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామాలలో చెరువు శిఖం భూములు మరి కొంతమంది ఆలయాల పేరుతో ఆక్రమిస్తుంటే కొంతమంది రైతులు పట్టా భూమిని ఆనుకుని ఉన్న శిఖం భూములను మట్టి పోసి మరి కబ్జా చేస్తున్నారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులో మట్టి పోసి శిఖం భూమిని ఆక్రమిస్తున్నారని సమీప రైతులు ఇటీవల జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజుల క్రితం మాదాపూర్ పూరచెరువులు రామాలయ నిర్మాణం చేపట్టడానికి మట్టిని పోసి చెరువును ఆక్రమించే ప్రయత్నం చేస్తే గ్రామస్తులు పోరాడి దానిని అడ్డుకున్నారు. మైలారం గ్రామంలో కొంతమంది రైతులు చెరువు మధ్యలో మట్టిని పోసి దారి ఏర్పాటు చేస్తే ఇప్పటివరకు అధికారులు అటువైపు చూడలేదని గ్రామ ప్రజలు అంటున్నారు. గుండ్లపల్లి దేవుని చెరువులో మరోవైపు పెద్దమ్మ దేవాలయం నిర్మాణం కోసం రాత్రికి రాత్రి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఆ విగ్రహాన్ని అధికారులు ఇప్పటివరకు తొలగించలేదు. విగ్రహం ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు . వరద కాలువ ఉపకాల్వ ల మట్టిని తొలగించి రైతులు సాగు చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురై అన్యాక్రాంతమైన చెరువులకు, ప్రభుత్వ భూములకు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్వవైభవం తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. హైడ్రా తరహా వ్యవస్థను గ్రామస్థాయిలో ఏర్పాటుచేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

పాల కేంద్రాన్ని తొలగించాలి

గుండ్లపల్లి దేవుని చెరువు శ్రీకాంత్ భూమిని ఆక్రమించి కరీంనగర్ డెయిరీ పాల కేంద్రం నిర్మాణం చేపట్టారు. దీనిని ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. లక్షల విలువచేసే సుమారు 10 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఇప్పటికైనా చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి దానిని కూల్చివేయాలి. లేని పక్షాన సీపీఐ ఆధ్వర్యంలో గట్టి పోరాటం చేస్తాం. :-చొక్కల్లా శ్రీశైలం, సీపీఐ మండల సహాయ కార్యదర్శి

Advertisement

Next Story