ఇథనాల్ పరిశ్రమ బాధితులకు కాంగ్రెస్ మద్దతు: మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
ఇథనాల్ పరిశ్రమ బాధితులకు కాంగ్రెస్ మద్దతు: మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, వెల్గటూర్: తెలంగాణ ప్రభుత్వం వెల్గటూరులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ బాధితులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాధితులకు భరోసానిచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర మంగళవారం ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెరింది. ఇథనాల్ బాధిత గ్రామాల్లోని ప్రజలు వాహనాల్లో తరలివెళ్లి పాదయాత్రలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ప్రాణాలకు హానీ తలపెట్టే ఇథనాల్ పరిశ్రమను వెల్గటూరు లో నిర్మించకుండా ఆపేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఎందాకైనా పోరాడడానికి సిద్ధమని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కాలుష్య కారకమైన ఇంత పెద్ద పరిశ్రమను కట్టాలని చూడడం ప్రభుత్వం సిగ్గుచేటుగా భావించాలన్నారు. ప్రజలకు మంచి చేసే పరిశ్రమ అయినప్పుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ప్రజలతో ఎందుకు మమేకం కాలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రజలకు హానీ చేసే పరిశ్రమ అయినందునే వారు చాటుమాటుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పోలీసుల చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కి రహాస్యంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. విష వాయువులను వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీని జనావాసాలకు దూరంగా తరలించేంత వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు త్వరలోనే నేను ఇథనాల్ బాధిత గ్రామాల్లో పర్యటిస్తానని బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పోరాటం ఏ ఒక్కరి కోసమో జరుగుతోంది కాదు నీవు నేను అనే నిబంధనలు పెట్టుకోకుండా ప్రజలందరూ ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇథనాల్ పరిశ్రమ బాధితులంతా స్టాప్ ఇథానాల్... సేవ్ లైఫ్ అని ముద్రించిన బ్లాక్ టీ షర్టులు ధరించి కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, సర్పంచ్ లు మేరుగు మురళి, బొప్పు తిరుపతి రాందేని కోటయ్య, గోపతి నరేష్ రాజయ్య తిరుపతి సుమారుగా 200 మంది ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story