గొలుసుకట్టు దందా.. బిట్‌‌కాయిన్‌ పేరుతో దగా..!

by Shiva |
గొలుసుకట్టు దందా.. బిట్‌‌కాయిన్‌ పేరుతో దగా..!
X

దిశ, బ్యూరో కరీంనగర్: చట్టబద్ధత లేని యూబిట్‌ కాయిన్‌ చైన్‌ వ్యాపారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా 11లక్షల మంది సభ్యులను కూడగట్టుకుని పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న గోలుసుకట్టు దందా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయి కోట్ల రూపాయలకు పైబడి రాబట్టుకుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులతో పెద్దఎత్తున పెట్టుబడి పెట్టిస్తు వారిని బలి చేస్తున్నారు. విదేవీ టూర్ల లాభాల ఆశచూపి గుట్టుచప్పుడు కాకుండా ఈ యూబిట్‌ కాయిన్‌ చైన్‌ దందాను దళారులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వ్యాపారులు ఇప్పటికే వందల మందిని ఈ దందాలోకి దింపినట్లుగా తెలుస్తుంది.

మొదట రూ.50 వేల పెట్టుబడి పెట్టిన వారికి డాలర్ల రూపంలో కాయిన్లు వస్తాయని ఆశ చూపిస్తూ ముగ్గులోకి దించేస్తున్నారు. ఆ పెట్టుబడికి ప్రతినెలా వడ్డీ రూపంలో వీరి ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నట్లు చూపుతున్నారు. దీంతో పాటు సభ్యులు మరో ఐదుగురిని చేర్పిస్తే వారికి మరింత అదనంగా ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించిన వారికి యూబిట్‌ కాయిన్‌ సంస్థ స్టార్‌ రేటింగ్స్ ప్రకటిస్తుండటం విశేషం. ఫైవ్‌ స్టార్‌ పొందిన వారు ఈ దందాలో సీనియర్లుగా చెలామణి అవుతూ.. జిల్లా అంతటా సభ్యులను చేర్పించారు. కరీంనగర్ పెద్దపల్లి, సిరిసిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, కామారెడ్డి లాంటి పట్టణాల్లో కూడా వీరు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు చెబుతున్నారు.అయితే ఈ చైన్‌ దందాలో చివరకు ఎవరు చెల్లింపులు చేస్తారనే విషయంపై స్పష్టత లేకున్నా అమాయకులు రూ.లక్షలు పెట్టుబడి పెడుతున్నారు.

వ్యాపారులు, ఉద్యోగులను నమ్మి పెట్టుబడులు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ ఇల్లంతకుంట మండలాలకు చెందిన టీచర్లు, కరీంనగర్‌లోని కొంతమంది వ్యాపారులు సూత్రధారులుగా ఉంటూ ఈ గోలుసుకట్టు దందాను సాగిస్తున్నట్లు తెలుస్తుంది. పెట్టుబడి పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఎగబడి పెట్టుబడులు పెట్టడం వారు వారి వ్యాపారాలను సైతం పక్కన పెట్టి గోలుసుకట్టు దందా పుల్ టైం చేయడంతో అమాయక జనం యూబిట్ కాయిన్ దందా వైపు మొగ్గు చూపి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తుంది. మరోవైపు పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం కష్టమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం గోవిందా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా‌లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న యూబిట్‌ కాయిన్‌ దందా దాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఇంతకు ముందు జనం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి లాభాలు పోందేవారు, అయితే, యూబిట్ కాయిన్ దందా‌లో లాభాలు అధికంగా వస్తున్నాయని దళారులు ఆశ చూపడం, స్టార్ రేటింగ్స్ ఇస్తూ విదేశీ టూర్లకు తీసుకోవడంతో అమాయకులు గోలుసుకట్టు దందాలో ఏదో రహస్యం ఉంది అన్నట్లుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ దందా మైకంలో పడి కొందరు వ్యాపారులు వారు చేస్తున్న సొంత వ్యాపారాలను సైతం మానుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed