వైద్యం పేరుతో వ్యాపారం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

by Aamani |
వైద్యం పేరుతో వ్యాపారం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
X

దిశ, రాయికల్: డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా, మలేరియా వంటి విష జ్వరాలతో పల్లెలు, పట్నం తేడా లేకుండా ప్రజలు అల్లాడుతున్నారు. అయితే ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.అర్హత లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాయికల్ లో కొందరు ఆర్ఎంపీలు, పిఎంపీలు నిబంధనలకు వ్యతిరేకంగా క్లినిక్ లు నిర్వహిస్తుండడం పరిస్థితి తీవ్రత కు అద్దం పడుతుంది.అర్హత లేకుండా విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. మరికొందరైతే ఏకంగా పాథాలజీ ల్యాబ్ లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకొని టెస్టుల పేరుతో ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. రాయికల్ పట్టణంలో ఎంత జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల అమ్మకం..

కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే వేల రూపాయల మందులను ప్రజలకు అంటగడుతున్నారు. ఇటీవల ఓ మెడికల్ షాప్ యజమాని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చిన మెడిసిన్ వాడిన ఓ రోగి ఆసుపత్రి పాలయ్యాడు.హై డోస్ మందులు వేసుకోవడం తో కిడ్నీలపై ఎఫెక్ట్స్ పడి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం మెడికల్ షాపుల నిర్వాహకుల కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. డిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులను కోరుతున్నారు.

ఒక్క వార్డుకే పరిమితమైన వైద్య శిబిరం..

రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా దాదాపు అన్ని వార్డులలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క వార్డులోనే ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మిగిలిన వార్డులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జ్వర పీడితులు చేసేది ఏమి లేక ఆర్ఎంపీ లను ఆశ్రయిస్తున్నారు.

అంటిముట్టనట్టుగా ఆరోగ్య శాఖ..

సీజనల్ వ్యాధులు వచ్చే క్రమంలో ప్రతి సం. ఆరోగ్య శాఖ అప్రమత్తం గా ఉండాల్సింది పోయి ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధుల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులలో కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్ఎంపీ, & పీఎంపీ క్లినిక్ లలో ప్రజలు ఇంకా వైద్యం చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే కొందరు డాక్టర్లు, సిబ్బంది వ్యవహరించే తీరు నచ్చక ప్రైవేటు ఆసుపత్రుల వైపు ప్రజలు వెళ్తున్నారు. జిల్లా ఆరోగ్య శాఖ నిత్యం ఆసుపత్రుల తనిఖీలు చేయకపోవడం వారిపై చర్యలు తీసుకోక పోవడం తోనే గతంలో కొందరు ఆర్ఎంపీ డాక్టర్ల వైద్యం వికటించి ప్రాణాలు పోయిన సంఘటనలలో ఆ ఆర్ఎంపీ పైన క్రిమినల్ కేసులు నమోదు కావడం ఆ సమయంలో హడావిడి చేసే ఆరోగ్య శాఖ ఇలాంటి సమయంలో ప్రజల ఆరోగ్యమే మా సంపాదనగా భావించే కొందరు ఆర్ఎంపీ, పీఎంపీ లు తమ క్లినిక్ లలో బెడ్లు వేసి వైద్యం చేస్తూ ప్రజల వద్ద నుండి లక్షలు వసూలు చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రతి సం. సీసనల్ వ్యాధుల పేరుతో కొందరు ఆర్ఎంపీ, పీఎంపీ లు లక్షలు గడిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటి కైనా జిల్లా ఆరోగ్య శాఖ కండ్లు తెరిచి అలాంటి ఆర్ఎంపీ, పీఎంపీ ల క్లినిక్ లపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని రాయికల్ మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed