Bandi Sanjay : పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యం

by Aamani |
Bandi Sanjay : పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి బండి సందర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ 2018లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన నుండి దేశంలోనే అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీ, గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు 50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లను ఏర్పాటు చేసి ఖర్చుకు వెనుకాడకుండా భవనాలు నిర్మించిందన్నారు.

2022 లో కనీసం 20 శాతం ఎస్సీ జనాభా కలిగిన ప్రాంతాల్లోనూ ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని సం కల్పించిందన్నారు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేస్తే, ప్రస్తుతం 410 పాఠశాలల్లో విద్యా బోధన కొనసాగుతుందన్నారు. సగటున ఒక్కో ఏకలవ్య పాఠశాలల్లో 480 మంది విద్యార్థులతో దేశవ్యాప్తంగా 1,26,626 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. రాష్ట్రంలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే 8,309 మంది విద్యార్థిని విద్యార్థులు చదువు తున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి సగటున సంవత్సరానికి లక్ష తొమ్మిది వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు చేస్తుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిరిసిల్లలోనే రెండు గిరిజన, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పాఠశాలలను సందర్శించినట్లు తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్పిన సమస్యలన్నీ నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

పాఠశాల స్టాఫ్ పై ఫైర్..

మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో, మౌలిక సదుపాయాలు, సమస్యల గురించి విద్యార్థులతో మమేకమై అడిగి తెలుసుకున్నారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లలో నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదని విద్యార్థులు బండి సంజయ్ కి తెలిపారు. దీంతో టాయిలెట్ లో నీళ్లు రాకపోతే పట్టించుకోరా అని, అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారని, మన పిల్లలకైతే ఇదే విధంగా తినిపిస్తామా అంటూ మరిమడ్ల ఏకలవ్య పాఠశాల స్టాప్ ఫై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆటో సామాగ్రి ఇవ్వడం లేదని, గేమ్స్ పీరియడ్ లో ఆడుకోనివ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారని, ఇన్ని సమస్యలుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇది తొలిసారి కాబట్టి వదిలేస్తున్నానని మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. అప్పటికప్పుడు టాయిలెట్ల నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.

ఎమ్మార్వో అవుతా సార్..

బండి సంజయ్ పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించి పెద్దయ్యాక ఏమాగుతారని విద్యార్థులను ఉద్దేశించి అడిగారు. నేను పోలీస్ అవుతా, డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా అంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. అంతలో 9వ తరగతి చదువుతున్న ఆకాష్ నేను ఎమ్మార్వో ను కావాలనుకుంటున్నాను సార్ అని చెప్పడంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని మరి ఎమ్మార్వోనే ఎందుకు కావాలనుకుంటున్నావ్ అని అడిగారు. దానికి ఆ విద్యార్థి మా ఊళ్లో భూములన్ని దోచుకుంటున్నారు సార్... నేను ఎమ్మార్వో అయ్యాక వాటన్నిటిని కాపాడుతా అని చెప్పాడు. విద్యార్థి చెప్పిన సమాధానానికి భేష్ అంటూ బండి సంజయ్ అభినందించారు. మరెవ్వరికి రాజకీయ నాయకులు కావాలని లేదా అని ఆయన ప్రశ్నించారు. దానికి విద్యార్థులు ఎవ్వరూ ఆసక్తి చూపకపోవడంతో హాస్యాస్పదంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు పరిస్థితి ఇలా ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed