విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్దపల్లి నుండి 16 బస్సులు...

by Sumithra |
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్దపల్లి నుండి 16 బస్సులు...
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో నిర్మించిన 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి 16 బస్సులలో ప్రజలు బయలుదేరి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణ తెలిపారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు జిల్లా నుంచి హాజరయ్యే ప్రజల తరలింపు కోసం చేస్తున్న ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల నుండి 6 బస్ ల చొప్పున, మంథని 3, ధర్మపురి నియోజకవర్గం ధర్మారం నుండి ఒక బస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రం నుంచి ఉదయం 7 గంటలకు బస్సులు బయలుదేరి హైదరాబాద్ చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చే వరకు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి బస్సులో ఇద్దరు డ్రైవర్లను, ఒక లైజనింగ్ అధికారిని, పోలిస్ అధికారిని, అసిస్టెంట్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రంలో తహసిల్దార్ బ్రేక్ ఫాస్ట్ తో పాటు, బస్సులో వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి బస్సులో 50 మంది వరకు ప్రజలు ఉంటారని, వారందరికి ఎంట్రి పాసులు లైజనింగ్ అధికారి అందించాలని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు లంచ్, డిన్నర్ లో నాణ్యమైన భోజన సదుపాయం కల్పించామని, దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రజలు తరలింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జెడ్పీ సీఈఓ. శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ లు సుమన్ రావు, రాజశేఖర్, ఎంపీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed