కొత్త నేతలకు ఓటర్ల ఝలక్.. ఆదిలాబాద్ మినహా 8 స్థానాల్లో అదే సీన్

by Rajesh |
కొత్త నేతలకు ఓటర్ల ఝలక్.. ఆదిలాబాద్ మినహా 8 స్థానాల్లో అదే సీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగిన కాషాయ పార్టీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే 4 స్థానాల నుంచి 8 స్థానాలకు ఎగబాకడంతో పార్టీ శ్రేణులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మిగతా స్థానాల్లో ఓడిపోవడంపై పార్టీ ఆరా తీస్తోంది. కొత్తగా చేరిన నేతలకు ఓటర్ల ఆదరణ దక్కలేదు. ఎన్నికల సమయంలో కొత్తగా బీజేపీలో చేరి టికెట్ పొందిన నేతలంతా ఓటమి పాలయ్యా రు. ఆదిలాబాద్ మినహా 8 స్థానాల్లో ఓటమి చవిచూశారు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికే ఓటర్లు జై కొట్టారు. అవసరానికి పార్టీలోకి చేరే నేతలకు ఓటర్లు మొండిచేయి చూపించారు. బీజేపీలో కూడా ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాధవీలత, గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డి, అరూరి రమేశ్, తాండ్ర వినోద్ రావు, సీతారాంనాయక్, బీబీ పాటిల్, పోతుగంటి భరత్ కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ సైతం కొత్తగా పార్టీలో చేరినా ఆయన విజయతీరాలకు చేరుకున్నారు. కొత్తగా చేరిన వారిలో 8 మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ మాధవీలతను బరిలోకి దింపింది. అయితే ఆమెకు పార్టీ ప్రాథమిక సభ్యుత్వం లేకున్నా టికెట్ ఇచ్చి తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. దీనిని రాజాసింగ్ మొదలు స్థానిక నేత లు సైతం వ్యతిరేకించారు. హైకమాండ్ ఆమెకు ప్రాధాన్యతనిచ్చి ఎంత హైప్ ఇచ్చినా గతం కం టే భారీగా బీజేపీ ఓటు షేర్ తగ్గింది.

నల్లగొండ అభ్యర్థి సైదిరెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడి బీజేపీ లో చేరారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దని శ్రేణులు ఆది నుంచి వ్యతిరేకించారు. అయినా హైకమాండ్ మాత్రం ఆయన్ను చేర్చుకుని టికెట్ ఇచ్చింది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. ఆయనకు సీనియర్ నాయకులు మద్దతివ్వలేదు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ఓటర్లను మెప్పించలేకపోయారు. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి పోతుగంటి భరత్ ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. గతంలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలను మాత్రం ఓటర్లు గెలిపించి.. కొత్తగా చేరి టికెట్ పొందిన వారికి మాత్రం ఝలకిచ్చారు. పార్టీ కూడా దీనిపై ఆరా తీస్తోంది. ఫెయిల్యూర్‌కు గల కారణాలను అన్వేషిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed