బీజేపీలోకి NTV చైర్మన్ నరేంద్ర చౌదరి..?

by Satheesh |   ( Updated:2024-02-03 12:15:12.0  )
బీజేపీలోకి NTV చైర్మన్ నరేంద్ర చౌదరి..?
X

దిశ, వెబ్ డెస్క్: పలు మీడియా సంస్థలు బీజేపీకి ఇప్పటికే దగ్గర కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ కూడా ఆ జాబితాలో చేరనున్నదా?.. రానున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలపడడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదా?.. ఇప్పుడు ఇలాంటి చర్చ జోరుగా జరుగుతున్నది. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి త్వరలోనే బీజేపీలో లాంఛనంగా చేరి రాజ్యసభలోకి ఎంట్రీ కాబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. గతేడాది సిటీలో జరిగిన కోటి దీపోత్సవానికి చీఫ్ గెస్టుగా ప్రధాని మోడీ హాజరుకావడంతో పాటు ఇటీవలే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ నర్సింహారావు పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుండడంతో ఆ స్థానం నుంచే నరేంద్ర చౌదరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే తీరులో ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా చర్చల్లో నలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చొరవతో తిరుమల కొండపై స్థలం కేటాయింపు, అక్కడ ‘శ్రీ రచన’ పేరుతో గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా ఇందులో భాగమేననేది ఆ చర్చల్లోని ఒక అంశం. గతేడాది సెప్టెంబరులో సీఎం జగన్ స్వయంగా ఈ గెస్ట్ హౌజ్‌ను ప్రారంభించగా రెండు నెలల తర్వాత (నవంబర్ 25న) ప్రధాని మోడీ తిరుమల సందర్శన సందర్భంగా ఆ గెస్ట్ హౌజ్‌లోనే బస చేశారన్న వార్త అప్పట్లోనే ప్రచారంలోకి వచ్చింది. గతేడాది నవంబరులో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్టీవీ – భక్తీ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు.

వీటన్నింటికి కొనసాగింపుగా గత నెల చివరి వారంలో ఎన్టీవీ చైర్మన్ చౌదరి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లూ వార్తలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఎన్టీవీ చౌదరికి రాజ్య సభ సభ్యత్వం ఇచ్చే విషయంలో బలంగానే మద్ధతు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర వర్గాల్లోనూ మాటలు వినిపించాయి.

Advertisement

Next Story