KTR : రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ? : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ(AICC)సంతృప్తి చెందిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా అంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ఏఐసీసీ సంతృప్తి చెందిందంటూ పీసీసీ చీఫ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టారు. ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి ? తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా అని కేటీఆర్ ప్రశ్నించారు. అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా అని, కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ? అని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా లేక మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా అని నిలదీశారు. హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా, ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా అని దుయ్యబట్టారు.

రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా లేక తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా అని, సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా..మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ? అని నిలదీశారు. ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోందని, కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ తన మరో ట్వీట్ లో మీరు తెలంగాణలోని మహిళలకు నెలకు రూ. 2,500లన 100 రోజుల్లో అమలు చేస్తామమని హామీ ఇచ్చి మోసం చేశారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇప్పటికి దాదాపు 350 రోజులైందని, మీరు చెప్పిన హామీ అమలు కోసం తెలంగాణలోని 1.67 కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారని, ఈ మోసపూరిత వాక్చాతుర్యంతో మీర, మీ పార్టీ విసిగిపోలేదా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story