నకిలీ మద్యంపై ఉక్కుపాదం: Srinivas Goud.. బెల్ట్ షాపుల నిర్వహణపై నో కామెంట్..

by Kalyani |   ( Updated:2022-12-20 12:11:03.0  )
నకిలీ మద్యంపై ఉక్కుపాదం: Srinivas Goud.. బెల్ట్ షాపుల నిర్వహణపై నో కామెంట్..
X

దిశ, ఎల్బీనగర్: నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో భారీ మొత్తంలో పట్టుబడ్డ నకిలీ మద్యంపై సోమవారం హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండగా.. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్టు షాపులపై మీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా.. ఇది సందర్భం కాదంటూ దాటవేసే ధోరణి ప్రదర్శించారు. మరో విలేకరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందా.. అందుకే ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడం లేదా.. అని ప్రశ్నించగా మీది ఏ ఛానల్ అంటూ ఎదురు ప్రశ్న వేసి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇక తెలంగాణ బ్రాండ్ పేరుతో ఒడిశాలో కల్తీ మద్యం తయారీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. ఇక్కడ తీగ లాగితే.. ఒడిశాలో డొంక కదిలిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న నకిలీ మద్యం పట్టుకున్న ఎక్సైజ్ అధికారులను మంత్రి అభినందించారు. ఒరిస్సా లోని కటక్ జిల్లా తంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అభయ్ పూర్ అటవీ ప్రాంతంలో మద్యం తయారు చేస్తున్నారని చెప్పారు. పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా, నకిలీ మద్యం తయారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ మద్యాన్ని కట్టడి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ప్రధాన నిందితులు బింగి బాలరాజు గౌడ్, అన్నేపల్లి కొండల్ రెడ్డి, అనుచరుడు పోరండ్ల సంజయ్ కుమార్, గునేటి గోపికృష్ణ, ఒరిస్సా కు చెందిన రంజిత్ సమాల్ తో కలిపి మొత్తం ఐదు మంది నిందితులను అరెస్టు చేశారని, మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటారని తెలిపారు. ఇప్పటికే అనుమానం వచ్చిన నారాయణగూడలోని ఓ మద్యం దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేయించామని వివరించారు. బార్ కోడ్ లోనూ ఎలాంటి డౌట్ రాకుండా ఈ పన్నాగం పన్నారని చెప్పారు. దాదాపు రూ. 2.5 కోట్ల మద్యాన్ని అధికారులు సీజ్ చేశారని తెలిపారు. గతంలో ఇలాంటి పనులు మాఫియాలు చేస్తుండేవని, కానీ తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా, అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో ఆగిపోయిందని చెప్పారు. నకిలీ మద్యం తయారీ గానీ, అమ్మకం గానీ ఎక్కడైనా జరిగితే సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య, ఎక్సైజ్ అధికారులు టీ రవీందర్ రావు, డీ అరుణ్ కుమార్, సూర్య ప్రకాష్ రావు, బీ హనుమంతరావు, జీవన్ కిరణ్, ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ రెడ్డి, కల్పన, రామకృష్ణ, పీ శ్రీధర్ రావు, జీ శ్రీనివాసరావు, చిరంజీవి, సత్యనారాయణ రావు, యాదయ్య, విష్ణు, వెంకన్న, ఇబ్రహీం పాషా తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story