- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండగట్టు చోరీపై ఇన్వెస్టిగేషన్ స్పీడ్‌అప్
దిశ, కరీంనగర్ బ్యూరో : కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి పాల్పడిన ముఠా గురించి జగిత్యాల పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ భాస్కర్ ఈ ఘటన తరువాత పోలీసులతో సమీక్షిస్తూ రాబరీ గ్యాంగ్ ఆనవాళ్లతో పోలీన వాళ్లు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకునే పనిలో నిమగ్నం కావాలని ఆదేశించారు. వీరు కర్ణాటక లేదా హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే వీరి ఆనవాళ్లతో ఉన్న గ్యాంగుల గురించి పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు అధికారులతో కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.
సీసీ ఫుటేజీల సేకరణ..
అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు కేవలం ఆలయాల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలే కాకుండా వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ కూడా సేకరిస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అనుమానితులు ఇంతకు ముందు ఆ ప్రాంతంలో సంచరించారా లేక అదే రోజు తిరిగారో తెలుసుకునే పనిలో పడ్డారు.
గత వారం రోజులకు సంబంధించిన ఫుటేజీని డీవీఆర్ బాక్సుల నుంచి సేకరించి పరీక్షిస్తున్నారు. చోరీ జరిగిన తీరు గమనిస్తే ఖచ్చితంగా వీరు గతంలోనే రెక్కీ నిర్వహించేందుకు ఆలయానికి వచ్చి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే పొలాస, కొండగట్టు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే గురువారం వీరు ఏ సమయంలో కొండపైకి వచ్చారోనని కూడా ఆరా తీస్తున్నారు.
టవర్స్ డంప్...
మరోవైపు జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆయా కంపెనీలకు చెందిన టవర్ ఏరియాల్లోని మొబైల్ నెంబర్లను కూడా తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కో టవర్ ను డంప్ చేసి వాటి పరిధిలో కొత్తగా రికార్డయిన నెంబర్లను ఆధారం చేసుకుని కూడా విచారించేందుకు కొన్ని పోలీసు బృందాలను పురమాయించినట్టు తెలుస్తోంది. కొత్త మొబైల్ నెంబర్లు ట్రేస్ అయితే అవి ఏయే లొకేషన్ల మీదుగా కొండగట్టుకు చేరుకున్నాయి.
తిరిగి ఏఏ టవర్ ఏరియాల మీదుగా వెళ్లాయో తెలిస్తే కేసు ఛేదనలో పురోగతి సాధించే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. సదరు నెంబర్లు ఏ స్టేట్‌కు చెందినవో తెలుసుకోవడంతో పాటు సిమ్ కార్డులు వాడే మొబైల్ ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు మార్చినా తెలిసే అవకాశం ఉంటుందని దీని ద్వారా అయినా దొంగల ఆచూకీ లభ్యం అవుతుందని అనుకుంటున్నారు.
ఎలా వచ్చారో... ఎలా వెళ్లారో...?
ముఖ్యంగా దోపిడీకి పాల్పడిన ముఠా ఏఏ ప్రాంతాలకు వచ్చిందోనన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. పొలాస, కొండగట్టు ఆలయాల్లో జరిగిన చోరీ విధానాల్లో దగ్గరి పోలిక ఉన్నదని ఓ అంచానాకు పోలీసు అధికారులు వచ్చినప్పటికీ ఈ రెండు ఆలయాల్లో చోరీకి పాల్పడిన ముఠాలు వేర్వేరు అని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
అయితే పొలాస ఆలయంలోని డీవీఆర్ బాక్సు ఎత్తుకెళ్లడంతో ఇక్కడ దోపిడీకి విఫలయత్నం చేసిన ముఠా గురించి క్లారిటీ లేకుండా పోయింది. అయితే సాంకేతికతతోనే ఈ వివరాలను రాబట్టాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో దొంగలు జగిత్యాల మీదుగా కొండగట్టుకు చేరుకున్నారా లేక వేరే దారి గుండా కొండగట్టుకు చేరుకుని జగిత్యాల మీదుగా వెళ్లారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది.
సీతమ్మ బావి...
కొండగట్టు అంజన్న ఆలయానికి వెనక ప్రాంతంలో దిగువన ఉన్న సీతమ్మ బావి ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ సంచరించాయి. ఆ తరువాత భేతాళ స్వామి గుడి మీదుగా ఆలయ ప్రాంతంలో తచ్చాడాయి. అయితే గ్యాంగ్ సీతమ్మ బావి సమీపంలో సంచరించి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు వీరు కొండపైకి ఎలా చేరుకున్నారు..? తిరిగి ఎలా వెళ్లారు? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
సీతమ్మ బావి మీదుగా బయటకు వెళ్లినా అవతలి ప్రాంతమంతా కూడా అటవీ ప్రాంతంతో పాటు గుట్టలు విస్తరించి ఉన్నందున అటుగా వెళ్లి ఉంటారా లేదా అనేది అంతుచిక్కకుండా పోయింది. ఒక వేళ ఆ ప్రాంతం మీదుగా తప్పించుకునేందుకు సాహసించినా కనీసం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర గుట్టలు, అడవిని దాటి వెళ్తే తప్ప గ్రామాలకు చేరే అవకాశం లేదు.
అయితే అర్థరాత్రి వేళల్లో వీరు రాళ్లు రప్పల మీదుగా ఆ ప్రాంతాన్ని దాటుకుని వెళ్లేందుకు సాహసిస్తారా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వినియోగంలో లేని మెట్ల దారి కూడా ఉన్నప్పటికీ అటువైపు వెళ్లాలంటే పోలీస్ ఔట్ పోస్టు దాటాల్సి ఉంటుంది. అయితే పాత కోనేరు ప్రాంతంలో మానసిక వికలాంగులను ఉంచే ఆనవాయితీ చాలా కాలంగా వస్తున్నందున రాబరీ గ్యాంగ్ వెళ్లినవారు భక్తులేమోనని పోలీసులు అనుమానించే అవకాశం ఉంటుందని అటుగా కిందకు చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రధానంగా వీరు చోరీ చేసిన సుమారు 15 కిలోల వెండి వస్తువులను ఎలా కిందకు తీసుకెళ్లి ఉంటారన్నది కూడా అంతుచిక్కకుండా పోయింది. వాహనంలో అయితే వీరు ఖచ్చితంగా నాచుపల్లి జేఎన్ టీయూ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అంత అర్థరాత్రి సమయంలో వాహనాల రాకపోకలు శబ్దం అయ్యే అవకాశం కూడా ఉంటుందని అలాంటప్పుడు వీళ్లు అంత రాత్రి తిరిగి వెళ్లి ఉండకపోవచ్చని కూడా అనుకుంటున్నారు. తెల్లవారు జామునే వీరు నింపాదిగా గుట్ట దిగి ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లిపోయి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు...
కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి పాల్పడిన ముఠాలను పట్టుకునేందుకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. స్పెషల్ పోలీసు టీమ్స్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రాబరీ గ్యాంగ్స్‌ను విచారించనున్నట్టు సమాచారం.