- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Seethakka : గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. మా ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మేలు చేస్తోందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో గిరిజన సంక్షేమంపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహుకరించారు.
విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలి
అనంతరం సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. తాను ఏ శాఖలో ఉన్నా మనసు గిరిజన సంక్షేమం మీద ఉంటుందని అన్నారు. నా ప్రాణం ఆదివాసీ, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుందన్నారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు కల్పించారని, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని వివరించారు. దీంతో 5 వేల మంది ఆశ్రమ పాఠశాల టీచర్లకు ప్రయోజనం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు, టీచర్లు వారధులని, టీచర్లు మనసుపెట్టి పని చేయాలని సూచించారు. విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, సొంత పిల్లల్లాగానే వారిని తీర్చిదిద్దాలని తెలిపారు.
నాది కూడా హాస్టల్ జీవితమే..
నాది కూడా హాస్టల్ జీవితమే చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. హాస్టల్ పిల్లలంటే చులకన భావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని అవహేళన చేసే వారికి గుణపాఠం చెప్పేలా కసితో కష్టపడాలి.. అప్పుడే ఎదుగుతామని సూచించారు. 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను మూడు రేట్లు పెంచామన్నారు. ఏడేళ్ల తర్వాత డైట్ చార్జీలను 40 శాతం పెంచామన్నారు. గత ప్రభుత్వం విద్య వ్యవస్థకు చేసిదేం లేదని మండిపడ్డారు. హాస్టల్ల కోసం గతంలో కొనుగోలు చేసిన వస్తువులు సరిగా లేవని, నాసిరకం వస్తువుల కొనుగోలుపై విచారణ జరిపిస్తామన్నారు. హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న సమస్యలు సృష్టించి బయట శక్తులు మనకు అపఖ్యాతి తెచ్చే కుట్రలు చేస్తున్నారని సూచించారు. ఐటీడీఏ పనితనాన్ని మెరుగు పరచాలన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ. 17 వేల కోట్లు కేటాయించారని, సమగ్రంగా బడ్జెట్‌ను వినియోగించుకోవాలన్నారు. ఐటీడీఏ పీవోలు చాలా పవర్ఫుల్ అని, ఆ ప్రాంతాల పరిపాలకులు మీరేనని అన్నారు. విస్తృతంగా పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. ఉపాధి అవకాశాల కోసం మన ప్రాంతాన్ని దాటి వెళ్లేలా తీర్చిదిద్దాలని, ఉన్న ఊరిలోనే ఉపాధి రావాలంటే కష్టమన్నారు.