Indiramma Houses: మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. 4వేల ఇండ్లు మంజూరు

by karthikeya |
Indiramma Houses: మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. 4వేల ఇండ్లు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: మిడ్ మానేరు నిర్వాసితుల కల నెరవేరింది. ఎళ్లతరబడి ఎదురుచూపులకు తెర పడింది. ప్రాజెక్ట్ సమయంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం పడిగాపులు కాస్తున్న నిర్వాసితులకు ఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 గ్రామాలలోని నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా.. బోయిన్‌‌పల్లి మండలం మాన్వాడ దగ్గర 25.6 టీఎంసీల సామర్థ్యంతో 2.32లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2006లో మిడ్ మానేర్ ​ప్రాజెక్ట్ నిర్మాణం​మొదలుపెట్టారు. 2019లో ఈ ప్రాజెక్ట్​పూర్తయింది. అయితే డ్యాం నిర్మాణం వల్ల చుట్టుపక్కల 12 గ్రామాలు నీట మునిగాయి. ఈ గ్రామాల్లోని 11,731 కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఆర్‌‌‌‌అండ్ఆర్​కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. అయితే ఈ జాగాల్లో నిర్వాసితులు సొంత డబ్బుతోనే ఇండ్లు నిర్మించుకున్నారు.

అయితే ఈ ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ రూ.5.04 లక్షలు ఇస్తామని 2015 మాటిచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారు. ఆ తర్వాత 2016లో మిడ్ మానేరు కట్ట తెగినప్పుడు పరిశీలనకు వచ్చినప్పుడు కూడా ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షలు ఇస్తామన్నారు. అందుకు 4 వేల మంది అర్హులుగా తేలితే.. వారిలో కేవలం 2 వేల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed