జూబ్లిహిల్స్ బరిలో మహిళలు..!

by Shiva |   ( Updated:2023-09-24 04:21:11.0  )
జూబ్లిహిల్స్ బరిలో మహిళలు..!
X

దిశ, జూబ్లీహిల్స్ : ప్రజల్లో జూబ్లీహిల్స్ అంటే ఒక వైబ్రేషన్, రాజకీయంగా చక్రాలు తిప్పే ప్రముఖులు ఉండే ప్రాంతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్ బీజేపీలో సరియైన నాయకులు లేకపోవడంతో టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ పోటీలో నిలిచే అభ్యర్థులకు ఆర్థిక బలంతో పాటు, జనాల్లో ఫాలోయింగ్ తప్పనిసరి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ కోసం పారిశ్రామిక వేత్తలు, డాక్టర్స్, సినిమా యాక్టర్స్ నుంచి డివిజన్ లీడర్‌ల వరకూ పోటీపడుతున్నారు. వీరిలో జూటూరి కీర్తిరెడ్డి, పద్మా వీరపనేని, లంకాల దీపక్‌రెడ్డి, జీవిత రాజశేఖర్ ప్రధానంగా ఉన్నారు. వీరిలో ఎవరిని బీజేపీ టికెట్ వరిస్తుందో వేచిచూడాలి.

బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ..

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఒకప్పటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన బలం, బలగాలతో బలమైన బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్నారు. గోపీనాథ్‌ను ఢీకొట్టే బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ అధిష్టానం ఉంది. దీంతో జూబ్లీహిల్స్‌ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొంది. ఆర్థికంగా ఉండి ప్రజల మన్ననలు పొందే నాయకులు ఎవరు ఉన్నారని అధిష్టానం సందిగ్ధంలో పడింది. ఎలాగైనా జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తుంది.

గ్రూప్ రాజకీయాలకు తెర..

జూబ్లీహిల్స్‌లో జాతీయ పార్టీలకు మంచి కేడర్ ఉన్న, సరైన నాయకుడు లేక టికెట్ ఆశించిన పలువురు ఆశావహులు టికెట్ నాకే వస్తుందంటే నాకే వస్తుందంటూ కలిసి పనిచేస్తూనే గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. పార్టీ మీటింగ్ జరిగితే ప్లాస్టిక్ నవ్వులతో కలిసి ఉంటూ, మదిలో టికెట్ ఎవరికి ఇస్తారో అని ఆందోళనలో నాయకులు కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలిసింది. వీరిలో ముఖ్యంగా జూటూరి కీర్తిరెడ్డి పలు బిజినెస్‌లకు డైరెక్టర్‌గా ఉంటూ, ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరి రాజకీయాలకు చేరువ అయ్యారు.

కీర్తిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సాయం చేస్తూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలకు చేరువకావాలనే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో కీర్తిరెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. పార్టీకి కావల్సిన అర్హతలు, ప్రజలకు సేవ చేసే లక్షణాలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే శక్తి అన్నీ తనలో ఉన్నాయని, తనకే జూబ్లీహిల్స్ టికెట్ వస్తుందని కీర్తిరెడ్డి ధీమాగా ఉన్నారు. కీర్తిరెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు టికెట్ వస్తోందనే ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ నాయకులతో సత్సంబంధాలు..

డా.పద్మా వీరపనేని వైద్యురాలిగా ఎన్నో ఏళ్లుగా ప్రజల ప్రాణాలు కాపాడి కొన్నిసార్లు ఉచితంగా వైద్యం కూడా అందించారు. రైజ్ ఫౌండేషన్ స్థాపించి పేదలకు ఎంతో సేవ చేశారు. రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబ నేపథ్యంలో ఈమె 2019లో డాక్టర్ వృత్తినీ పక్కనపెట్టి బీజేపీ పార్టీలో చేరి జాతీయ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ దగ్గర అయ్యారు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, పార్టీ తరుపున ప్రజలకు సేవ చేస్తుండడంతో పద్మకు జూబ్లీహిల్స్ టికెట్ వస్తుందని విపరీతంగా ప్రచారం సాగుతోంది.

జూబ్లీహిల్స్‌లో బీజేపీ పార్టీని ముందుండి నడిపే వ్యక్తి ఎవరంటే ముందుగా లంకాల దీపక్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. 2018 ఎన్నికల అనంతరం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న దీపక్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకే తప్ప ప్రజల తరపున పోరాడిన, యాక్టివ్‌గా ప్రజా సమస్యల పై పోరాడిన దాఖలాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి కట్టుబడి, ప్రజలలో ఉన్న నాయకుడిని నేను అని, పలువురు పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని దీపక్‌రెడ్డి వర్గియులు ప్రచారం చేస్తున్నారు.

లోక్ సభకు జీవితా రాజశేఖర్..

రాజకీయాలకు జీవితా రాజశేఖర్ కొత్త కాదు. కానీ ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్‌లో ఆవిడ పేరు వినబడుతోంది. ఆమెను లోక్‌స‌భ‌కు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా నేత తమ పార్టీకి అవసరమని, గ్లామర్ రోల్‌తో పార్టీకి ప్లస్, టికెట్ ఇస్తేనే పార్టీలో యాక్టివ్ అవుతానని జీవితా రాజశేఖర్ అధిష్టానానికి చెప్పడంతో ఆమెకు బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందే రావటంతో జీవిత జూబ్లీహిల్స్‌తో పాటు ఇంకో 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య..

జూబ్లీహిల్స్ బీజేపీలో ఇప్పటి వరకు ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉండే వారు. ఇప్పుడు కొత్తగా జీవితారాజశేఖర్ రావటంతో నేతలకు ఒక పక్క టికెట్ ఆమెకు ఇస్తారా..? అతనికిస్తారా..? అని ఆందోళన మొదలైంది. టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీనీ గెలిపించుకునే సంఖ్యాబలం కేడర్‌కు ఉంది. కానీ పార్టీకి కట్టుబడి కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగానే ఉంటున్నారు. కానీ కిందిస్థాయి కేడర్‌కు సరైన బరోసా ఇచ్చి, వారికి అండగా నిలిచే నేతలు కరువయ్యారని కేడర్ ఎదురు చూస్తున్నారు. పార్టీ కేడర్‌కే కాదు ప్రజలకు అండగా నిలిచి, బరోసా ఇచ్చే నాయకులకే ఎక్కువగా ఓటర్లు మద్దతు ఇస్తారని కిందిస్థాయి లీడర్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు బరోసా, అధిష్టానం మన్ననలు ఎవరికి దక్కేనో వేచిచూడాలి.

Read More: ఇరకాటంలో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్.. ఒకే విషయంలో ముగ్గురు దొరకడంతో టార్గెట్ చేసిన BRS..!

సీక్రెట్ మీటింగ్‌కు కారణమేంటి.. టీ-బీజేపీలో అసలు ఏం జరుగుతోంది..?

Advertisement

Next Story