చైనీస్​ మాంజా వెనుక ఎవ్వరున్నా వదిలిపెట్టం : అడిషనల్​ డీసీపీ

by Kalyani |
చైనీస్​ మాంజా వెనుక ఎవ్వరున్నా వదిలిపెట్టం : అడిషనల్​ డీసీపీ
X

దిశ, చార్మినార్​ : పశుపక్ష్యాదులకు , మనుషులకు ప్రాణాంతకంగా మారిన చైనీస్​ మాంజా కేంద్రాలపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు కొరడా ఝులిపించారు. హైదరాబాద్​ పరిధిలోని చైనీస్​ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనీస్​ మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు రెడ్​ హ్యాండెడ్​గా అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 1500 చైనీస్​ మాంజా చెరకులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్​ రావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పురాణి హవేలి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్​ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్​ రావు వెల్లడించారు. గత సంవత్సరం లంగర్​హౌజ్​ ఫ్లైఓవర్​ పై చైనీస్​ మాంజా వేలాడడం కారణంగా బైక్​పై వెళ్తున్న ఓ సైనికుడి గొంతు తెగి మృతి చెందడంతో పాటు అనేక పశు పక్షాదులు చైనీస్​ మాంజాకు చిక్కుకుని మృత్యువాత పడుతున్నాయని గుర్తు చేశారు.

హైదరాబాద్​ సిటీ పోలీస్​ కమిషనర్​ ఆదేశాల మేరకు సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​, ఈస్ట్​ జోన్​ టాస్క్​ఫోర్స్​, సౌత్​ ఈస్ట్​ జోన్​, సౌత్​ వెస్ట్​ జోన్​ ల పరిధిలోని సంబంధిత ఎస్​హెచ్​ఓలతో కలిసి నిషేధిత చైనీస్​ మాంజా కేంద్రాలపై స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నామన్నారు. సౌత్​ ఈస్ట్​ టాస్క్​ ఫోర్స్​ పరిధిలోని సైదాబాద్​, బహదూర్​పురా, మాదన్నపేట్​, కాచిగూడ, సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పరిధిలోని టప్పా చబుత్ర, మీర్​ చౌక్​, మొఘల్​పురా, ఈస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పరిధిలోని చిలకలగూడ, ఏయు సిటి, సౌత్​ వెస్ట్​ టాస్క్​ఫోర్స్​ పరిధిలోని షాహినాత్​ గంజ్​, నారాయణ గూడ పోలీస్​ స్టేషన్​ ల పరిధిలలో చైనీస్​ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి, 12 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

వారిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ , గుజరాత్​, బాంబే ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు పెద్ద మొత్తంలో చైనీస్​ మాంజా రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా ఇన్​స్ట్రాగ్రామ్​ ద్వారా కూడా ఆర్డర్లు బుక్​ చేసుకుని చైనీస్​ మాంజాను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత సంవత్సరం లంగర్​హౌజ్​ ఫ్లైఓవర్​ పై చైనీస్​ మాంజా వేలాడడం కారణంగా బైక్​పై వెళ్తున్న ఓ సైనికుడి గొంతు తెగి మృతిచెందడంతో హైదరాబాద్​ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరో ఘటన తెలంగాణలో జరగకూడదన్న నెపంతో ముందస్తు చర్యల్లో భాగంగా చైనీస్​ మాంజా పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

చైనీస్​ మాంజా వద్దు..... దేశీయ మాంజానే వాడండి

చైనీస్​ మాంజా పౌడర్​, గ్లాస్​ లేదా మెటల్​ వంటి రాపిడి పదార్థాలతో పూసిన సింథటిక్​ నైలాన్​ స్ట్రింగ్​తో ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. చైనీస్​ మాంజా చాలా పదునైనదని ముఖ్యంగా పాదాచారులు, మోటర్​ సైకిలిస్టులకు తీవ్ర గాయాలు, మరణాలకు కూడా కారణమవుతోందన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్​లో పశు పక్షాదులకు ప్రాణాంతకంగా మారుతుందన్నారు. చైనీస్​ మాంజా కు చిక్కుకుని చివరకు మరణానికి దారితీస్తుందన్నారు. నాన్​ బయోడిగ్రేడబుల్​ నైలాన్​తో తయారు చేయబడిన చైనీస్​ మాంజా గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు.

పర్యావరణ, వన్యప్రాణుల రక్షణ చట్టాల ప్రకారం అనేక రాష్ట్రాల్లో చైనీస్​ మాంజాను విక్రయించడం, ఉపయోగించడం నిషేధించబడిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా పడే అవకాశం ఉందని, ఒక వేళ నేరం రుజువైతే ఏడేళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని అందె శ్రీనివాస్​ హెచ్చరించారు. మీడియా సమావేశంలో సౌత్​జోన్​ టాస్క్​ ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ ఎస్​.రాఘవేంద్ర, అఫ్జల్​ గంజ్​ ఎస్​హెచ్​ ఓ రవి నాయక్​, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story