బ్రేకింగ్: GHMC ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్

by Satheesh |   ( Updated:2023-07-28 06:41:55.0  )
బ్రేకింగ్: GHMC ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్
X

దిశ, సిటీ బ్యూరో: వర్షం సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ, వరద బాధితులకు రూ. పదివేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.. అక్కడి నుంచి నేరుగా వెళ్లి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ డౌన్ డౌన్... జీహెచ్ఎంసీ డౌన్ డౌన్.. అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను ఈడ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ విజయ రెడ్డి, మహిళా నేత సునీతా రావులు మాట్లాడుతూ.. వర్షాకాలం సహాయక చర్యలు సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మహానగర ప్రజలు వర్షాల్లో మునిగి ఇబ్బందుల పాలవుతుంటే సర్కారు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు.

ఉప్పల్ కాంగ్రెస్ లీడర్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇంతటి ముంపు సమస్య లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నేడు నగరం ముంపునకు గురవుతుందని ఆరోపించారు. నూతన ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మేయర్ ఒక్క ప్రాంతాన్ని కూడా ఇంతవరకు సందర్శించకపోవడం సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.

Read More: నగరాన్ని వదలని వాన.. కాలనీలు, బస్తీలను ముంచెత్తిన వరద

Advertisement

Next Story

Most Viewed