Property tax: ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని సర్కారు

by Mahesh |
Property tax: ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని సర్కారు
X

దిశ, సిటీబ్యూరో : ఏ నిబంధనైనా సామాన్యులకే తప్ప పాలకులకు కాదన్న విషయం మరోసారి రుజువైంది. గత సర్కారు హయాంలో సామర్థ్యానికి మంచి అభివృద్ధి పనులు చేపట్టి, రూ.6,500 కోట్ల అప్పులు చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి ఎక్కువ బకాయిలు రావల్సింది రాష్ట్ర ప్రభుత్వం నుంచే. ప్రొఫెషనల్ ట్యాక్స్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావల్సిన మ్యుటేషన్ ఛార్జీలు, మోటారు వెహికల్ ట్యాక్స్ వంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జీహెచ్ఎంసీకి రావాల్సి ఉన్నాయి. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ రూ.వేల కోట్లు బకాయి పడింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ సర్కారు ప్రాపర్టీ ట్యాక్స్ రూ.107 కోట్లలో ఇప్పటి వరకు జరిపిన చెల్లింపులు శూన్యమేనని సమాచారం. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రొఫెషనల్ ట్యాక్స్ వాటా రూ.300 కోట్ల వరకు బకాయిలుండగా, ఇప్పటి వరకు సర్కారు చెల్లించిందేమీ లేదని సమాచారం. తాజాగా గురువారం ప్రకటించిన స్టేట్ బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకున్నట్లు తెలిసింది.

దీనికి తోడు ఈ ఏటా మ్యుటేషన్ చార్జీలుగా రావల్సిన రూ.175.46 కోట్లు కాగా, గడిచిన దశాబ్దం కాలంగా ఈ బకాయిలు రూ.2,950 కోట్లకు పేరుకు పోయినట్టు సమాచారం. ఈ బకాయిల చెల్లింపునకు సంబంధించి సర్కారు గానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గానీ చెల్లించటం లేదు. ఇప్పటి వరకు మ్యుటేషన్ చార్జీలు ఎంత చెల్లించాల్సి ఉందన్న విషయంపై ఇటు జీహెచ్ఎంసీలో గానీ, అటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో గానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వేల కోట్లలోనే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఆస్తుల వినియోగాన్ని బట్టి పన్ను వసూలు చేయాలని న్యాయస్థానాలు స్పష్టం చేసినా, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవటంతో ఆ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోతున్నాయి. స్టేట్ సర్కారు భారీగా బకాయిపడ్డ నిధులను ఏకకాలంలో చెల్లించకుండా, జీహెచ్ఎంసీలో జీతాల చెల్లింపులకు నిధులు లేనప్పుడు ప్రతి నెల రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు చెల్లిస్తూ వస్తున్నట్లు సమాచారం.

బకాయిలు కొండంత..కేటాయింపులు రవ్వంతే..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావల్సిన బకాయిల్లో సర్కారు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రవ్వంత నిధులు కేటాయించిందంటూ కొందరు జీహెచ్ఎంసీ అధికారులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. రూ.5 వేల కోట్ల ఇవ్వాలని ప్రాజెక్టుల ప్రతిపాదనలు పంపినా, వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకుని సర్కారు కేవలం రూ.3065 కోట్లను కేటాయించింది. ఇక ఎంఏయూడీకి సర్కారు రూ.15,594 కోట్లు కేటాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో రూ.11 వేల 372 కోట్లు కేటాయించగా, సవరించిన బడ్జెట్‌లో రూ.7,441 కోట్లను కేటాయించింది. తాజాగా ప్రవేశపెట్టిన (2024-25) సంవత్సర బడ్జెట్‌లో రూ.15 వేల 594 కోట్లను కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరం కన్నా అదనంగా రూ.8,153 కోట్లకు పెంచింది.

కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు, హెచ్-సిటీ స్కీం కింద జీహెచ్ఎంసీలో వివిధ రకాల ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ.2675.35 కోట్లు, హైడ్రాకు రూ.200 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద జీహెచ్ఎంసీకి రూ.369 కోట్లు, జీహెచ్ఎంసీ తో పాటు రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు కలిపి మరో రూ.411 కోట్లను ఎంఏయూడీ కేటాయించింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్రొఫెషనల్ ట్యాక్స్ వాటా రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 కోట్లను కేటాయించిన సర్కారు, బకాయిలను దాచుకునేందుకు రూ.3065 కోట్లను మాత్రమే కేటాయించిందన్న వాదనలున్నాయి.

Advertisement

Next Story