రోడ్లపైనే విచ్చలవిడిగా పార్కింగ్.. ఇబ్బందులు పడుతున్న పబ్లిక్

by Shiva |
రోడ్లపైనే విచ్చలవిడిగా పార్కింగ్.. ఇబ్బందులు పడుతున్న పబ్లిక్
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్య సర్వ సాధారణంగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. పెరుగుతున్న షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, షో రూమ్స్ దీనికి తోడు సర్వీసు రోడ్ల అక్రమణలతో వాహనదారుల కష్టాలు షరా మామూలుగా మారాయి. అడుగుతీసి అడుగు బయటపెట్టడం కూడా కష్టంగా మారుతోంది. సర్వీసు రోడ్డులో ఛాయ్ బండ్లు, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వీరికి కొందరు చోటామోటా నాయకులు వత్తాసు పలుకుతూ రోజుకు ఇంతా అని చిరు వ్యాపారుల వద్ద మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సర్వీసు రోడ్ల అక్రమణలతో షాపింగ్ మాల్స్‌కు, ఇతర అవసరాల కోసం బయటకు వచ్చిన వాహనదారులు ప్రధాన రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో సాయంకాలంలో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఇవన్నీ తెలిసినా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఒక్కరోజు హడావుడి చేసి, సర్వీసు రోడ్లలో ఉన్న తాత్కాలిక దుకాణాలను తరలిస్తున్నామంటూ హడావుడి చేసి మిన్నకుంటున్నారు. ఛలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులు పెడుతూ, చెంపలు వాయిస్తున్నారు కొందరు ట్రాఫిక్ పోలీసులు. కానీ ప్రజల ట్రాఫిక్ కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

సర్వీసు రోడ్లలో ఆక్రమణల పర్వం..

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలోని ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న సర్వీసు రోడ్లు ప్రజా అవసరాల కంటే కొందరి స్వార్థానికే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. శేరిలింగంపల్లి నుంచి మొదలు మియాపూర్ అల్వీన్ క్రాస్ రోడ్డు వరకు, అలాగే మదీనా గూడ నుంచి కూకట్ పల్లి వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న సర్వీసు రోడ్లలో వాహనాలు వెళ్లేందుకు, పాదాచారులు నడిచేందుకు సైతం అవకాశం లేకుండా తోపుడు బండ్లు, షాపింగ్ మాల్స్ కు వచ్చే వినియోగదారుల వాహనాలు, స్కూల్, కాలేజీల బస్సులను పూర్తిగా నిలిపి ఉంచుతున్నారు. కొన్నిచోట్ల అయితే కనీసం సర్వీసు రోడ్డు ఉందన్న విషయం ఆనవాళ్లు లేకుండా పోయాయి.

షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు దర్జాగా ఈ రోడ్లను వాడేస్తున్నాయి. భాగ్యనగర్ కాలనీలోని పలు షాపింగ్ మాల్స్ సర్వీసు రోడ్లను పార్కింగ్ స్థలాలుగా వాడేస్తున్నాయి. ఎల్లమ్మబండ వైపు నుంచి వచ్చే వాహనాలు, ముంబై హైవే మీదుగా వెళ్లే వాహనాలతో కేపీహెచ్ బీ రోడ్డు అనునిత్యం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రోజు అక్కడే ఉండే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఫొటోస్ కొట్టడానికి పెట్టిన శ్రద్ధ, షాపింగ్ మాల్స్ యాజమాన్యాల పార్కింగ్ ను పెట్టకుండా ఆపడంపై పెట్టడంలేదు. ఇదే పరిస్థితి మదీనాగూడ నుండి మొదలు శేరిలింగంపల్లి వరకు కనిపిస్తుంది. ఈ దారిలో ఇరువైపులా సర్వీసు రోడ్ల ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. అయినా ట్రాఫిక్ పోలీసులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు.

వీధి వ్యాపారులతో అష్టకష్టాలు..

చందానగర్ మంజీరా పైపు లైన్ రోడ్డు సాయంత్రం అయిందంటే చాలు మెయిన్ రోడ్డును మించి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. శేరిలింగంపల్లి గీతా థియేటర్ నుంచి మై హోమ్స్ వరకు అలాగే మెయిన్ రోడ్డు వెంట ఉన్న సర్వీసు రోడ్డులో గంగారం నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు సర్వీసు రోడ్డు మొత్తం వీధి వ్యాపారులు ఆక్రమించేశారు. అను ఫర్నీచర్ నుంచి రాయల్ కేఫ్ వరకు ఉన్న సర్వీసు రోడ్డులో షాప్స్ కు వచ్చే వినియోగదారుల వాహనాలు, వీధి వ్యాపారుల తోపుడు బండ్లతో నిండిపోతున్నాయి. ఈ రోడ్డులో ఉన్న తోపుడు బండ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకంగా దుకాణ సముదాయం ఏర్పాటు చేశారు.

మెయిన్ రోడ్డు నుంచి ఖాళీ చేయించి అక్కడికి తరలించారు. తిరిగి రెండు రోజుల్లోనే వారు యథావిధిగా మళ్లీ నెలకొల్పారు. ఇక్కడే ఓ సూపర్ మార్కెట్ ఇతర వాణిజ్య సముదాయాలు, హాస్పటల్, ఫుడ్ స్ట్రీట్ సైతం ఉండడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులే పాత క్యాప్రీ హోటల్ సమీపంలో నెలకొంది. ఇక్కడ రోడ్లపైనే బండ్లు పెట్టడంతో ప్రమాదాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం స్పందించక పోగా రోడ్డుపైనే వాహనాలు పెడుతున్నారంటూ ఛలాన్లు బాదేస్తున్నారని పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed