బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి మెయిన్ రీజన్ ఇదే...!

by S Gopi |
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి మెయిన్ రీజన్ ఇదే...!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ఉన్న పెద్ద సంఘాల నాయకులు, సభ్యుల అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు వెలువడడం ఉపాధ్యాయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

పీఆర్టీయూ కొంప ముంచిన అనైక్యత:

రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ. ఆ సంఘం నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తే చాలు.. దాదాపుగా విజయం సాధించినట్లే అన్న నమ్మకం ఉపాధ్యాయులది. కానీ, ఈ యూనియన్ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండడం, ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేయడం. ఉపాధ్యాయ, విద్యా సంబంధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, 317 జీవో వల్ల ఉపాధ్యాయులు చాలామంది స్థానిక ఇతరులు కావడం. భార్యలు ఒకచోట, భర్తలు ఒకచోట, పిల్లలు మరొకచోట అన్న విధంగా మారినప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు. తమ పలుకుబడులను ఉపయోగించుకుని కోరుకున్న పాఠశాలలకు బదిలీలు చేయించుకోవడం, ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవడం. మిగతా ఉపాధ్యాయ సంఘాల సభ్యుల సంగతి అటుంచితే.. సొంత యూనియన్ సభ్యులే వ్యతిరేకించారు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డికి మ్యాండేడ్ ఇవ్వకపోవడం, గుర్రం చెన్నకేశవరెడ్డిని తమ యూనియన్ తరపున అభ్యర్థిగా పోటీలో దించడంతో యూనియన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ టీఎస్ మద్దతుతో వెనకంజ వేయకుండా పోటీలో ఉండడం... ఆయన 1200కి పైగా ఓట్లు పొందడం.. అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపింది. పీఆర్టీయూ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందితే తిరిగి అధికార పార్టీలో చేరుతారు అన్న భయంతో పీఆర్టీయూకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీనితో గెలుపొందవలసిన పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి ఓటమిపాలు కావాల్సి వచ్చింది.

కామ్రేడ్ లను కనికరించలేదు..

విద్య, ఉపాధ్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ సంస్థలు పోరాటాలు చేయడం అనాదిగా వస్తుంది. యూటీఎఫ్ తరఫున మాణిక్ రెడ్డి పోటీ చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా పీఆర్టీయూ అభ్యర్థికి కాకుండా.. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ఎన్నికలలో పెద్దగా ఖర్చు చేయకపోవడం, గెలిచినా వీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉంటారన్న భయం, ఆ తర్వాత సమస్యలను ఎవరు పట్టించుకుంటారు అన్న అనుమానాలతో ఉపాధ్యాయులు ఆలోచించి తమ తీర్పును ఇచ్చారు.

ఏవీఎన్ రెడ్డికి కలిసొచ్చిన అనుభవం..

బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఏవీఎన్ రెడ్డికి అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం పోరాడుతున్న పార్టీ బీజేపీ అని, తమ సమస్యలపై కనీసం ప్రశ్నించడానికి అవకాశాలుంటాయి అన్న నమ్మకంతో ఓటర్లు ఏవీఎన్ వైపు మొగ్గు చూపారు. హంగు ఆర్భాటాలతో కాకుండా.. సైలెంట్ గా ప్రచారాన్ని కొనసాగించడం.. స్వయంగా టీములు ఓటర్ల వద్దకు వెళ్లి ఒప్పించడం., గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఏవీఎన్ రెడ్డి అనుభవం వినూత్న శైలితో ఎన్నికల ప్రచారం చేయడానికి దోహద పడింది. దీనితో మొదటి రౌండు మొదలుకుని ఫలితాలు ముగిసే వరకు ప్రతి రౌండ్ లోను మొదటి రౌండ్ లో వచ్చిన ఆధిక్యత తగ్గకుండా చివరి వరకు కొనసాగింది. గుర్రం చెన్నకేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసిన చాలామంది ఓటర్లు తమ రెండవ ప్రయారిటీ ఓట్లను ఏవీఎన్ కు వేశారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకించే ఇతర యూనియన్లకు సంబంధించిన ఓట్లు కూడా ఏవీఎన్ కు వచ్చాయి. దీంతో ఆయన గెలుపు సులభతరం అయ్యింది.

పరవాలేదు అనిపించిన హర్ష..

ఇప్పటికే పలు ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలు అయిన ఉమ్మడి జిల్లా వాసి హర్షవర్ధన్ రెడ్డి పర్వాలేదు అనిపించేలా ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోయినా ఉపాధ్యాయ సంఘాలు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోయినా చెప్పుకోదగిన స్థాయిలో హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు సాధించాడు. ఆయనకు మొత్తం 1097 పైగా ఓట్లు సాధించాడు. జిల్లా నుంచి పోటీ చేసిన మరో అభ్యర్థి, మాజీ విద్యాశాఖ అధికారి అయిన డాక్టర్ విజయ్ కుమార్ కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్నికల్లో విజయకుమార్ ప్రభావం నామముద్రంగానే మిగిలింది.

బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం:

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయం స్ఫూర్తితో ప్రజల్లోకి మరింతగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయ‌నున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించేలా వ్యూహాలు రూపొందించి అమలు చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తాము మద్దతు పలికిన అభ్యర్థి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story