Serilingampally: పోస్టింగ్ కోసం వెయిటింగ్.. చందానగర్ డీసీ పోస్ట్‌కు పైరవీలు

by Shiva |   ( Updated:2024-08-21 05:59:35.0  )
Serilingampally: పోస్టింగ్ కోసం వెయిటింగ్.. చందానగర్ డీసీ పోస్ట్‌కు పైరవీలు
X

దిశ, శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో పోస్టింగ్ అంటే ఆశామాషీ కాదు. అది డిప్యూటీ కమిషనర్ (డీసీ) లెవల్ పోస్ట్ అంటే మరీ ఎక్కువగానే పోటీ ఉంటుంది. అందులోనూ శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్ డీసీగా రావాలంటే ఏ స్థాయిలో పైరవీలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు చందానగర్ డీసీగా పని చేసిన వంశీకృష్ణ ఇటీవల లాంగ్‌లీవ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్ట్ గత కొంతకాలంగా ఖాళీగానే ఉంది. ఇప్పుడు అదే పోస్ట్ కోసం ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. కొందరు అధికారులు ఏకంగా మంత్రుల లెవల్‌లో పైరవీలు సాగిస్తున్నారంటే ఈ పోస్ట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం అవుతోంది.

డీసీ రేస్‌లో నలుగురు

చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ కోసం నలుగురు ఆశావాహులు పోటీపడుతున్నట్లు సమాచారం. అందులో మోహన్‌రెడ్డి, శైలజ, సుభాష్‌లతో పాటు మరో అధికారి తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకరు వయా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుల ద్వారా పైరవీలు చేస్తుండగా, మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫోన్లు చేయించుకున్నారని సమాచారం. మరొకరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధువుల ద్వారా ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని జీహెచ్ఎంసీ వర్గాల టాక్. అయితే, శేరిలింగంపల్లి సర్కిల్‌లో పనిచేస్తున్న పెద్ద సార్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో పోస్టింగ్ వేయించుకున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ద్వారా వచ్చే మరొకరికి ఇక్కడ అవకాశం లేకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుల ద్వారా పైరవీ చేస్తున్న వారికి కూడా అవకాశం ఉండకపోవచ్చని జీహెచ్ఎంసీ వర్గాల భోగట్టా. ఇక మిగిలింది సీఎం రేవంత్‌రెడ్డి బంధువుల ద్వారా ఒత్తిడి చేపిస్తున్న వారికే డీసీ పోస్ట్ దక్కవచ్చని బలంగా చెబుతున్నారు. అయితే, చందానగర్ సర్కిల్‌లో టీపీఎస్ సెక్షన్‌లో ఇద్దరు రెడ్డి అధికారులు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో డీసీగా రెడ్డి వర్గానికే చెందిన వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం.

సర్కిల్ 21పై అంత మక్కువ దేనికి..?

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్ 21లో డీసీ పోస్టింగ్ కోసం పైరవీలు కొత్తేమి కాదు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి గత ప్రభుత్వంలో ఓ కీలక మంత్రికి దగ్గరి వ్యక్తి అని ప్రచారం ఉండేది. అనంతరం పని చేసిన డీసీ కూడా పైరవీల ద్వారానే ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇలా చందానగర్ డీసీ పోస్ట్ కోసం మొదటి నుంచి పైరవీలు తప్పనిసరిగా మారాయనే చెప్పాలి. అయితే, మంత్రుల స్థాయిలో పైరవీలు చేసుకుని ఇక్కడ పోస్ట్ కోసం ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చందానగర్ సర్కిల్ పరిధిలో మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్ సర్కిల్‌లు ఉన్నాయి. ఇందులో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అన్నీ ఇల్లీగల్ నిర్మాణాలే, అక్కడ జీహెచ్ఎంసీ కిందిస్థాయి సిబ్బంది నుండి డీసీ, జోనల్ కమిషనర్ లెవల్ వరకు ముడుపులు ముడుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మియాపూర్, చందానగర్‌లోని ఇల్లీగల్ నిర్మాణాలు, ఇతర సోర్స్ నుంచి సైతం నెలనెలా పెద్ద మొత్తంలో ముడుపులు అందుతాయని, అందుకే ఇక్కడ పోస్టింగ్ కోసం అధికారులు నాయకుల వద్దకు క్యూ కడతారని సమాచారం.

ఈసారైనా మారేనా..

గత కొంతకాలంగా చందానగర్ సర్కిల్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ, ఆ శాఖ అనే తేడా లేకుండా అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు డీసీలు అవినీతి అధికారులు, సిబ్బందితో అంటకాగుతూ అందినకాడికి దండుకున్నారని, ఈ సారి వచ్చే డీసీ అయినా కనీస మార్పులు తేవాలని స్థానికులు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story